Razole: 2027 గోదావరి పుష్కరాలకు ఏటిగట్టు వద్ద పుష్కర ఘాట్ అభివృద్ధి!

Razole: 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా ఏటిగట్టు వద్ద రూ. 36 లక్షలతో పుష్కర ఘాట్ అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు.

PRABHU, RAZOLE
Published on: 11 Aug 2026 9:11 AM IST
Razole
X

Razole: 2027 గోదావరి పుష్కరాలకు ఏటిగట్టు వద్ద పుష్కర ఘాట్ అభివృద్ధి!

Razole: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా,రాజోలు మండలం, రాజోలు గ్రామ పంచాయతీ పరిధిలోని ఏటిగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పుష్కర ఘాట్‌ను అన్ని వసతులతో అభివృద్ధి చేయనున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు.

మంగళవారం ఏటిగట్టు ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పుష్కర ఘాట్‌ను సుందరంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. పుష్కర ఘాట్ అభివృద్ధి కోసం రూ.36 లక్షల నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు.

ఏటిగట్టు ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న పాపయ్య పంతులు గారిని ఎమ్మెల్యే అభినందించారు. స్థానికుల భాగస్వామ్యం, ప్రజల సహకారంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

పుష్కర ఘాట్ అభివృద్ధితో పాటు ఏటిగట్టు పరిసర ప్రాంతాల సుందరీకరణ, అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం, బరియల్ గ్రౌండ్ ఏర్పాటు, హెడ్‌వర్క్స్ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఏటిగట్టు ప్రాంతానికి ఉన్న సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సద్వినియోగం చేసుకుని రాజోలు ఏటిగట్టును ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేలా అవసరమైన మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ప్రాంత అభివృద్ధికి సంబంధించి స్థానిక నాయకులు, ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఏటిగట్టు ప్రాంత అభివృద్ధికి స్వచ్ఛందంగా సహకరించేందుకు పలువురు ముందుకు వస్తున్నారని, అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పుష్కర ఘాట్ అభివృద్ధితో పాటు రాజోలు ఏటిగట్టు ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story