Razole: వినాయక మండపాలకు 'యాప్' ద్వారా సింగిల్ విండో అనుమతులు!
Razole: రాజోలులో వినాయక ఉత్సవాలకు పోలీస్ నిబంధనలు విడుదల.. సింగిల్ విండో యాప్ ద్వారా అనుమతులు, నిమజ్జనానికి 2 ఘాట్ల ఏర్పాటు సీఐ సురేష్‌బాబు.
Razole: వినాయక మండపాలకు 'యాప్' ద్వారా సింగిల్ విండో అనుమతులు!
Razole: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ సురేష్‌బాబు ప్రజలకు సూచించారు. పండుగ సందర్భంగా పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా సీఐ సురేష్‌బాబు మాట్లాడుతూ.. వినాయక మండపాల ఏర్పాటుకు సంబంధించి సింగిల్ విండో విధానంలో ప్రత్యేక యాప్ ద్వారా అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండప నిర్వాహకులు యాప్‌లో తమ వివరాలను నమోదు చేస్తే పోలీస్, విద్యుత్, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన అనుమతులు పరిశీలించి ఆమోదం లభిస్తుందని చెప్పారు.
అనుమతులు పొందిన మండపాలకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందని, ఆ క్యూఆర్ కోడ్‌ను మండపం వద్ద ప్రదర్శిస్తే మండపానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత శాఖలు సూచించిన యాప్‌లో లాగిన్ అయి అనుమతులు పొందాలని సీఐ సూచించారు.
ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనం సందర్భంగా డీజేలు, బాణాసంచాకు ఎలాంటి అనుమతి లేదని, వాటిపై పూర్తి నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సైలెన్సర్లు తొలగించిన బైక్‌లతో తిరగడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం వంటి వాటిని సహించబోమని హెచ్చరించారు.
గతంలో వినాయక నిమజ్జనం ఒకే ప్రాంతంలో నిర్వహించేవారని, ఈ ఏడాది రెండు ఘాట్లలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఐ తెలిపారు. పెద్ద విగ్రహాలకు ఒక ఘాట్, చిన్న విగ్రహాలకు మరో ఘాట్‌లో నిమజ్జనం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
వినాయక చవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని, పోలీసులకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరుతు.. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.




