Razole: రాజోలు మండలం శివకోడులో రూ.10 కోట్లతో MSME ఇండస్ట్రియల్ పార్క్!

Razole: రాజోలు మండలం శివకోడులో రూ.10 కోట్లతో MSME ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. ఇక్కడ 26 ఫ్యాక్టరీలు రానున్నాయి.

PRABHU, RAZOLE
Published on: 4 Sept 2026 10:01 AM IST
Razole
X

Razole: రాజోలు మండలం శివకోడులో రూ.10 కోట్లతో MSME ఇండస్ట్రియల్ పార్క్!

Razole: నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాజోలు మండలం శివకోటి గ్రామంలో MSME ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు.

శివకోడు గ్రామంలోని సర్వే నంబర్లు 43/3, 44/5లోని 3.50 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ స్థలంలో APIIC ఆధ్వర్యంలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో 26 ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను నిర్మించనున్నట్లు తెలిపారు.

MSME ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

బీసీ కమ్యూనిటీ హాల్‌కు స్థల పరిశీలన

అనంతరం శివకోడు లేఅవుట్‌లో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన స్థలం, మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story