Razole: రాజోలు ఎస్సీ హాస్టల్‌పై అనవసర రాజకీయం వద్దు అయ్యోజీ వేమ!

Razole: రాజోలు ఎస్సీ బాలుర హాస్టల్ నిర్మాణంపై అనవసర రాజకీయం చేయవద్దని మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యోజీ వేమ కూటమి నేతల సమావేశంలో హితవు పలికారు.

PRABHU, RAZOLE
Published on: 16 Aug 2026 1:04 PM IST
Razole
X

Razole: రాజోలు ఎస్సీ హాస్టల్‌పై అనవసర రాజకీయం వద్దు అయ్యోజీ వేమ!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు ప్రభుత్వ ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్ నిర్మాణం విషయంలో అనవసర రాజకీయాలు చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు మానేపల్లి అయ్యోజీ వేమ అన్నారు. విశ్వేశ్వరాయపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేమ అధ్యక్షతన ఆదివారం కూటమి నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిని కొంతమంది ఓర్వలేక ప్రభుత్వంపై, ఎన్డీఏ కూటమిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వేమ ఆరోపించారు. ఇందులో భాగంగానే ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్ నిర్మాణాన్ని రాజకీయ అంశంగా మార్చుతున్నారని విమర్శించారు.

రాజోలు ప్రభుత్వ ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో జిల్లా కలెక్టర్ అనుమతితో పాత భవనాన్ని తొలగించినట్లు తెలిపారు. అనంతరం నూతన హాస్టల్ భవనాన్ని నిర్మించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిందన్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరిగిందని వివరించారు.

ఎస్సీల అభివృద్ధి, సంక్షేమంపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వేమ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హాస్టల్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులతో ఎమ్మెల్యే నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను రాజకీయాలకు వేదికగా మార్చడం సమంజసం కాదని హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం దళితులను రెచ్చగొట్టేలా వ్యవహరించకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని కోరారు.

హాస్టల్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని జిల్లా అధికారులు స్పష్టం చేశారని వేమ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణంపై అనవసర అపోహలు, విమర్శలు చేయకుండా సహకరించాలని ఆయన కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story