Razole: రాజోలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మె!

Razole: రాజోలు తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల సమ్మె. పేస్కేల్ అమలు, 70 శాతానికి ప్రమోషన్ల పెంపు మరియు కారుణ్య నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి.

PRABHU, RAZOLE
Published on: 16 Sept 2026 11:30 AM IST
Razole
X

Razole: రాజోలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మె!

Razole: రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం సమ్మెబాట పట్టారు. ఏపీ వీఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రాజోలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట టెంట్ ఏర్పాటు చేసి వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో తమ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, తమ కుటుంబాల జీవనానికి సరిపడే వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అందుతున్న సుమారు రూ.10 వేలతో నేటి రోజుల్లో కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, నిత్యావసరాల ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ వేతనంతో కుటుంబ జీవనం భారంగా మారింది అని కన్నీటి పర్యంతమయ్యారు. తమ కష్టాలను, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అర్థం చేసుకుని తమకు అండగా నిలవాలని కోరారు.

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి గ్రామ రెవెన్యూ సహాయకులకు పేస్కేల్ అమలు చేయాలని కోరారు. అలాగే నామినీగా విధులు నిర్వహిస్తున్న వీఆర్వోలను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వీఆర్ఏల ప్రమోషన్ కోటాను ప్రస్తుతం ఉన్న 30 శాతం నుంచి 70 శాతానికి పెంచి, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల కుటుంబాల్లో ఎవరికైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడకుండా కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు.

“మేము ప్రభుత్వంపై పోరాటం చేయాలనే ఉద్దేశంతో సమ్మెకు రాలేదు.. మా కుటుంబాల భవిష్యత్తు కోసం, మా న్యాయమైన హక్కుల కోసం ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకే సమ్మెకు దిగాం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మా పరిస్థితిని అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం” అని వీఆర్ఏలు పేర్కొన్నారు.

ఏళ్ల తరబడి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నామని, ఇకనైనా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. తమ కుటుంబాల్లో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్చలకు పిలిచి, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు చేపట్టిన సమ్మెకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు కోరారు. వీఆర్ఏల సమ్మెకు రాజోలు తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వీఆర్ఏ సంఘం అధ్యక్షులు దారపురెడ్డి వీరభద్రం, రాజోలు మండల అధ్యక్షులు ఉల్లూరి రమణ, కార్యదర్శి సోడదాసు సునీల్ రాజా, కలిగితి నాగేశ్వరరావు, కె. రామకృష్ణ, సోమాని రాధ, అమలదాసు లక్ష్మీ దుర్గ, అడబాల సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE