Malikipuram: మలికిపురం మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ!
Malikipuram: మలికిపురం మండలంలో రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.
Malikipuram: మలికిపురం మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ!
Malikipuram: మలికిపురం మండలంలోని ప్రజల రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ అధికారులను ఆదేశించారు. మలికిపురం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో అర్హత కలిగిన వారికి నిబంధనల ప్రకారం అన్‌అబ్జెక్షనబుల్ ల్యాండ్‌కు పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు. ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వారి సమస్యలను పరిశీలించి అర్హత ఉన్న కేసులను సకాలంలో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి, వాటి ఏర్పాటుకు అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా స్థలాల లభ్యతను పరిశీలించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
శంకరగుప్తం గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని త్వరితగతిన సేకరించి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నందున భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, అర్హత మరియు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.




