Razole: డిపో మేనేజర్‌ను కలిసిన ఆల్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్!
Razole: రాజోలు ఆర్టీసి డిపో మేనేజర్‌ను కలిసిన ఆల్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు.. అంతర్వేది-రాజోలు బస్సును పునరుద్ధరించాలని విజ్ఞప్తి.
Razole: డిపో మేనేజర్‌ను కలిసిన ఆల్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్!
Razole: మలికిపురం పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం గత అనేక సంవత్సరాలుగా రాజోలు ఏపీఎస్‌ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నడుస్తున్న అంతర్వేది–రాజోలు ఉదయం సర్వీసును ఇటీవల ఏకపక్షంగా నిలిపివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆల్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పోలిశెట్టి గణేష్ తెలిపారు.
ప్రతిరోజూ ఉదయం 6.30 గంటలకు అంతర్వేది పల్లిపాలెం నుంచి బయలుదేరే ఈ బస్సులో సుమారు 25 నుంచి 30 మంది వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇదే సర్వీసు మధ్యాహ్నం 12.30 నుంచి 1.00 గంటల మధ్య మలికిపురం చేరుకునే విధంగా నడిచేదని, ప్రస్తుతం సర్వీసు నిలిచిపోవడంతో ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే అంతర్వేది–రాజోలు ఉదయం ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరుతూ విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి రాజోలు ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి సమస్యను వివరించినట్లు పోలిశెట్టి గణేష్ తెలిపారు.
విద్యార్థుల రవాణా ఇబ్బందులను డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గణేష్ తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సర్వీసును వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆయన కోరారు.




