Rajahmundry: సైబర్ మోసాల్లో ఎంత రికవరీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి!
Rajahmundry: బ్యాంకింగ్ భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రభుత్వాలు, బ్యాంకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Rajahmundry: సైబర్ మోసాల్లో ఎంత రికవరీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి!
రాజమండ్రి: బ్యాంకింగ్ సేవల్లో భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రభుత్వాలు, బ్యాంకింగ్ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విజయవంతం కాలేకపోతున్నాయని శ్రీనివాస్ విమర్శించారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న అసలు వ్యక్తులు ఎవరు, వారి వెనుక ఎవరైనా పెద్ద శక్తులు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ నేరాల పేరుతో సామాన్యులు, నిరుపేదలు పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోతున్నారని, బాధితుల్లో చాలామందికి సకాలంలో న్యాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో వేల కోట్ల రూపాయల మేర సైబర్ మోసాలు జరుగుతున్నాయని, వాటి నియంత్రణకు ప్రభుత్వాలు ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎంత మొత్తాన్ని తిరిగి రికవరీ చేశారో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. పోలీస్ స్టేషన్ల నుంచి ప్రత్యేక సైబర్ క్రైమ్ విభాగాల వరకు ఫిర్యాదులపై వేగంగా స్పందించే వ్యవస్థ ఉండాలని అన్నారు. పోలీసుల చుట్టూ తిరగలేక, తమ ఫిర్యాదులపై చర్యలు జరుగుతాయనే నమ్మకం లేక పలువురు బాధితులు ఫిర్యాదు చేయడం లేదని పేర్కొన్నారు.
బ్యాంకింగ్ సేవలపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాతాల్లో నగదు మాయం కావడం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్ చెల్లింపుల్లో సమస్యలు తలెత్తడం, ఏటీఎంలలో నగదు సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు బాధిత ఖాతాదారులు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. అయితే కొన్నిచోట్ల సమస్యను పూర్తిగా పరిష్కరించకుండా కేవలం కొన్ని పత్రాలు అందించి సైబర్ సెల్‌కు వెళ్లాలని సూచిస్తున్నారని ఆరోపించారు.
సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా నష్టపోయిన నగదు తిరిగి వస్తుందనే భరోసా లేకపోవడం బాధాకరమన్నారు. సైబర్ మోసాలను గుర్తించడంలో బ్యాంకింగ్ వ్యవస్థ, నేర పరిశోధనా సంస్థలు మరింత సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఖాతాదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బ్యాంకింగ్ సేవలను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో బ్యాంకులో పొదుపు అంటే ప్రజలకు భద్రత, భరోసా ఉండేదని, ప్రస్తుతం సైబర్ మోసాల కారణంగా ఖాతాదారుల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. ఖాతాలో జరిగే సైబర్ మోసాల విషయంలో బ్యాంకుల బాధ్యతను స్పష్టంగా నిర్ధారించేలా చట్టపరమైన మార్పులు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు తిరిగి విశ్వాసం కలిగేలా సమర్థవంతమైన రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశానికి ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. డి.వి. రమణమూర్తి, ఎం.డి. హుస్సేన్, సిమ్మా దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్‌కుమార్, కారుమూరి యుగంధర్, కారుమూరి శిరీష, మేడిచర్ల శ్రీనివాసరావు, సుంకర వెంకట భాస్కర రంగారావు, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, బసా సోనియా, చల్లా సాంబశివరావు, చల్లా అఖిల్, దోషి నిషాంత్, లంక వీర వెంకట సత్యనారాయణ, కొల్లి సత్యనారాయణ, మట్టపర్తి తులసి, మోర్త ప్రభాకర్, ఏడిద బాబులు తదితరులు పాల్గొన్నారు.




