Rajahmundry: రోగి మరణిస్తే ఆసుపత్రి బిల్లులు వెనక్కి ఇవ్వాలి: మేడా శ్రీనివాస్!

Rajahmundry: ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగి మరణిస్తే వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆర్‌పీసీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 13 Sept 2026 11:53 PM IST
Rajahmundry
X

Rajahmundry: రోగి మరణిస్తే ఆసుపత్రి బిల్లులు వెనక్కి ఇవ్వాలి: మేడా శ్రీనివాస్!

రాజమండ్రి: ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగి మరణించిన సందర్భంలో అప్పటి వరకు రోగి కుటుంబ సభ్యులు చెల్లించిన మొత్తం సొమ్మును తిరిగి ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పీసీ) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

రాజమహేంద్రవరంలోని ఆర్‌పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవల పేరుతో రోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అర్హత, అనుభవం కలిగిన వైద్యుల స్థానంలో తక్కువ వేతనాలకు అర్హత లేని వారిని నియమించి అత్యవసర వైద్య విభాగాల్లో విధులు నిర్వహింపజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. సరైన అర్హత, అనుభవం లేని వైద్యుల కారణంగా రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు కూడా కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా రోగులు ప్రాణాలు కోల్పోతున్నా సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం తగిన స్థాయిలో స్పందించడం లేదని ఆయన విమర్శించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చోటుచేసుకుంటున్న రోగుల మరణాలపై సమగ్ర విచారణ జరిపి, వైద్యుల నిర్లక్ష్యం లేదా తప్పిదం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రోగి మరణించిన తర్వాత కూడా ఆసుపత్రి బిల్లులు పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి కుటుంబ సభ్యులకు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందన్నారు. మానవీయ కోణంలో ప్రభుత్వం స్పందించి, రోగి మరణించిన సందర్భంలో అప్పటి వరకు వసూలు చేసిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు తిరిగి చెల్లించేలా స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.

వైద్యుల అర్హతలు బహిరంగంగా ప్రదర్శించాలి

ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రి ఎదుట అక్కడ విధులు నిర్వహిస్తున్న అర్హత గల వైద్యుల పూర్తి పేర్లు, విద్యార్హతలు, వైద్య విభాగం, రిజిస్ట్రేషన్ వివరాలు, సంప్రదింపు నంబర్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా పెద్ద బోర్డుపై ఏర్పాటు చేయాలని మేడా శ్రీనివాస్ కోరారు.

కొన్ని ఆసుపత్రుల్లో అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, ఈ అంశంపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ఆసుపత్రులలో బోర్డులపై పేర్లు కనిపించే ప్రముఖ వైద్యులు వాస్తవంగా అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలించాలని కోరారు.

వైద్య పరీక్షలు, స్కానింగ్‌లకు ధరల పట్టిక ఏర్పాటు చేయాలి

ఒక ఆసుపత్రిలో వైద్యులు సూచించిన పరీక్షలను మరో ఆసుపత్రిలో పరిగణనలోకి తీసుకోకుండా మళ్లీ కొత్తగా పరీక్షలు చేయిస్తున్న సందర్భాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. దీనివల్ల రోగులు అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు.

వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, స్కానింగ్‌లు తదితర సేవలకు ఒక్కో కేంద్రంలో ఒక్కో ధర వసూలు చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం నియంత్రణ తీసుకురావాలని కోరారు. ప్రతి ఆసుపత్రి, వైద్య పరీక్షా కేంద్రం, స్కానింగ్ కేంద్రం వద్ద అందించే ప్రతి సేవకు సంబంధించిన ధరల పట్టికను పెద్ద బోర్డులపై ప్రజలకు కనిపించేలా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే వైద్యులు సూచించే మందులను ఒక నిర్దిష్ట మెడికల్ షాపులోనే కొనుగోలు చేయాలనే పరిస్థితులు లేకుండా ప్రభుత్వం పర్యవేక్షించాలని అన్నారు. రోగులు తమకు అనుకూలమైన, చట్టబద్ధమైన ఏ మెడికల్ షాపులోనైనా మందులు కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉండాలని పేర్కొన్నారు.

ప్రజా పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి

జిల్లా స్థాయిలో పనిచేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ (DM&HO) అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై సమర్థవంతమైన పర్యవేక్షణ చేయాలని మేడా శ్రీనివాస్ కోరారు. ఆసుపత్రుల్లో ప్రభుత్వ నిబంధనలు అమలవుతున్నాయా, వైద్యుల అర్హతలు సరైనవేనా, రోగుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారా అనే అంశాలపై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని అన్నారు.

వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరు, వైద్య పరీక్షలు, స్కానింగ్ కేంద్రాలు, మందుల విక్రయాలు, రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం అధికారికంగా ప్రజా సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

సామాన్య ప్రజల ఆదాయంలో అధిక భాగం ఆసుపత్రి ఖర్చులు, మందులు, వైద్య పరీక్షలు, స్కానింగ్‌లకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా పారదర్శకమైన వైద్య విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని మేడా శ్రీనివాస్ కోరారు.

ఈ సమావేశానికి ఆర్‌పీసీ సీనియర్ సెక్యులర్ దుడ్డే త్రినాథ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఆర్‌పీసీ సెక్యులర్స్ లంక దుర్గా ప్రసాద్, వర్ధనపు శరత్ కుమార్, దోషి నిషాంత్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, చల్లా సాంబశివరావు, బసా సోనియా, కందివలస రమణ, మట్టపర్తి తులసి, పందిరి మహేష్, త్రిపురాల పాండవులు, అడపా శేషగిరి, కళ్ళకూరి రవికుమార్, దబ్బి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY