Rajahmundry: రాజమండ్రిలో రూ.28 కోట్లతో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అరేనా-1 శంకుస్థాపన!

Rajahmundry: రాజమండ్రిలో రూ.28 కోట్లతో ఇండోర్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అరేనా-1కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రూ.42 కోట్లతో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 14 Oct 2026 12:31 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో రూ.28 కోట్లతో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అరేనా-1 శంకుస్థాపన!

Rajahmundry: నగరాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. విఎల్ పురం పాత లారీ స్టాండ్ వద్ద రూ. 28 కోట్లతో ఇండోర్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అరేనా-1కు శంకుస్థాపన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి సహకారంతో కేంద్ర ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక పథకం ‘ఖేలో ఇండియా’ ద్వారా రూ.14 కోట్ల నిధులు మంజూరు చేయించుకుని అరేనా-2 పనులు ప్రారంభించామని చెప్పారు.

తాజాగా రూ.28 కోట్లతో ప్రతిష్టాత్మక ఇండోర్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అరేనా-1 నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టులతో మొత్తం రూ.42 కోట్ల వ్యయంతో నగరంలో క్రీడా మౌలిక వసతులు అభివృద్ధి చెందనున్నాయని పేర్కొన్నారు. నగర చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం ఇదే తొలిసారని తెలిపారు. అరేనా-3 నిర్మాణానికి కూడా ఖేలో ఇండియా ద్వారా మరో రూ.10 కోట్ల నిధులు సాధించేందుకు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రయత్నిస్తారని, అది కూడా అందుబాటులోకి వస్తే మొత్తం రూ.52 కోట్లతో క్రీడా సముదాయాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆధునిక సాంకేతికతతో కూడిన ఆకర్షణీయమైన డిజైన్లతో ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని, సుమారు రెండు ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్, మరో మూడు ఎకరాల్లో పార్కింగ్, వాకింగ్ ట్రాక్, జిమ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదనంగా సుమారు 3,000 గజాల స్థలంలో ఫైవ్‌స్టార్ హోటల్ ఏర్పాటుకు కూడా అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అరేనా-2ను 2027 ఫిబ్రవరిలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అరేనా-1ను గోదావరి పుష్కరాలకు ముందే అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 2027 చివరి నాటికి ఈ కాంప్లెక్స్‌లో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించే దిశగా ముందుకెళ్తామని వెల్లడించారు.

ప్రతి డివిజన్లో మౌలిక వసతుల అభివృద్ధి నగరంలో రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైన్లు, పార్కులు, వీధి దీపాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గత రెండేళ్లలో అవసరమైన ప్రాంతాల్లో 140 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి లో-వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రధాన రహదారులతో పాటు ప్రజలు నివసించే ప్రాంతాల్లోని అంతర్గత రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.

నగరంలో గత రెండేళ్లలో సుమారు రూ.300 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, హెచఏఎం విధానంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన, అమృత్ 2.0, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని, గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చెప్పిందే చేస్తాం.. చేసిందే చెబుతామని అంతే కానీ గాలిలో మాటలు చెప్పడం కాకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యరూపంలో చూపించడమే తమ లక్ష్యమని ఆదిరెడ్డి వాసు అన్నారు. నగరనాs్న అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికి ఆదర్శ నగరంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY