Rajamahendravaram: పారిశుద్ధ్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి!

Rajamahendravaram: మోరంపూడి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో సే నో టూ ప్లాస్టిక్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనా ప్రారంభించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 21 Aug 2026 8:36 AM IST
Rajamahendravaram
X

Rajamahendravaram: పారిశుద్ధ్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి!

Rajamahendravaram: ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మోరంపూడి సిటీ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ అండ్ హైస్కూల్‌లో నిర్వహించిన ‘సే నో టూ ప్లాస్టిక్’ కార్యక్రమాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు కాలువల్లో పేరుకుపోవడం వల్ల మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడటంతో పాటు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని అధికారులు వివరించారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి ఎక్కువ కాలం పడుతుందని, వాటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని సూచించారు. విద్యార్థులు తమ ఇళ్లలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేలా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ముఖ్యంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులకు బదులుగా గుడ్డ సంచులు, పునర్వినియోగించగల వస్తువులను వినియోగించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పరిశుభ్రమైన నగరం, ఆరోగ్యకరమైన సమాజం కోసం పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు.

నగరంలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు సహకరించాలని కోరారు. అనంతరం ప్లాస్టిక్ రీయూస్ కోసం రూపొందించిన పలు ప్రయోగాలను వారు తిలకించారు.

ఈ సందర్భంగా ‘ప్లాస్టిక్‌కు నో చెబుతాం.. పర్యావరణాన్ని కాపాడుతాం’ అంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, నగర పాలక సంస్థ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story