Rajahmundry: ఎలక్ట్రీషియన్ల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి!

Rajahmundry: ఎలక్ట్రీషియన్ల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ఎలక్ట్రికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 27 Sept 2026 4:54 PM IST
Rajahmundry
X

Rajahmundry: ఎలక్ట్రీషియన్ల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి!

Rajahmundry: ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎలక్ట్రికల్ అసోసియేషన్ 23వ కార్యవర్గ సమావేశం ఆదివారం తిలక్ రోడ్డులోని వేమాస్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రీషియన్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ చర్యలపై చర్చించారు.

రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు డి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్ వృత్తి అత్యంత ప్రమాదకరమైనదని, ప్రమాదాలకు గురైన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 లక్షల పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలక్ట్రికల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. శ్రీహర్రావు మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్లకు ప్రభుత్వం టూల్ కిట్లు అందించాలని, జనవరి 27ను జాతీయ ఎలక్ట్రీషియన్ డేగా గుర్తించాలని కోరారు. అలాగే అమరావతిలో రాష్ట్ర ఎలక్ట్రికల్ యూనియన్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఉపాధ్యక్షుడు కె. పాల్‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర అసోసియేషన్ నిర్వహించిన ఆల్ ఇండియా ఎలక్ట్రికల్ టూర్‌లో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రీషియన్లకు వృత్తిపరమైన రేట్ల విషయంలో ఏకరీతి విధానం లేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన రేట్లు అమలయ్యేలా అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు.

రాజమహేంద్రవరం ఎలక్ట్రికల్ అసోసియేషన్ అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్లందరికీ టూల్ కిట్లు, బీఓసీ నుంచి అందాల్సిన క్లెయిమ్‌లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఓసీ సంక్షేమ బోర్డు ద్వారా ఎలక్ట్రికల్ కార్మికులకు రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

తూర్పుగోదావరి జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంతో పాటు వృత్తిలో ఎదురయ్యే సమస్యలు, ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుందని యాళ్ల శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పరిధిలోని ఎలక్ట్రీషియన్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా జిల్లా యూనియన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కోలాటి సువర్ణరాజు, వైస్ ప్రెసిడెంట్ కోమండూరి గణేష్ బాబు, సెక్రటరీ పత్తి మహేష్, జాయింట్ సెక్రటరీ మరడ పరశురాం, కోశాధికారి కొండపల్లి సతీష్ కుమార్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి పోసి, గౌరవ సలహాదారులు బోడకుర్తి గోపాలకృష్ణ, పాలేపు బాలకోటి మహేశ్వరరావు, కమిటీ సభ్యులు ఈదిబిల్లి సూర్యప్రకాష్, కులపాకుల దుర్గాప్రసాద్, చీకట్ల వెంకటేశ్వరరావు, పి.ఎన్.వి. గోపాలకృష్ణతో పాటు రాష్ట్ర అసోసియేషన్ నాయకులు, సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY