Etapaka: ఎటపాకలో టీడీపీ నేతల సస్పెన్షన్ కలకలం
Etapaka: ఎటపాకలో పాయం దేవికి మద్దతు తెలిపినందుకు మువ్వ శ్రీనివాసరావు సహా ముగ్గురు టీడీపీ నేతలను సస్పెండ్ చేయడంతో మీడియా ముందు సీనియర్ నేత కన్నీరుమున్నీరయ్యారు.
Etapaka: ఎటపాకలో టీడీపీ నేతల సస్పెన్షన్ కలకలం
ఎటపాక: ఎటపాక మండల టీడీపీ సీనియర్ నాయకులు మువ్వ శ్రీనివాసరావు, దొంతు మంగేశ్వరరావు, పాయం దేవిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఎటపాకలో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో సస్పెండ్ అయిన నేతలు ఎటపాకలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మువ్వ శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను 30 ఏళ్లుగా టీడీపీలో నిజాయితీగా పనిచేశానని, పార్టీ అభివృద్ధి కోసం ఆస్తులు కూడా పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యా పిల్లల కంటే పార్టీనే గొప్పదిగా భావించానని, చంద్రబాబు, లోకేష్ అంటే తనకు ప్రాణమని అన్నారు.
అసలేం జరిగింది
స్థానిక ఎన్నికల్లో ఎటపాక జడ్పీటీసీ అభ్యర్థిగా పాయం దేవిని టీడీపీ అధిష్టానం IVRS సర్వే ద్వారా ఎంపిక చేసిందని తెలిపారు.అయితే మాజీ జడ్పీటీసీ ఉబ్బా సుస్మిత వైసీపీలో సీటు రాకపోవడంతో స్వతంత్రంగా నామినేషన్ వేసి, తర్వాత జనసేనలో చేరి బీ-ఫారం తెచ్చుకున్నారని, సాంకేతిక లోపంతో ఆమెకు గాజు గ్లాసు గుర్తు రాక స్వతంత్రంగానే బరిలో ఉన్నారని చెప్పారు.
సుస్మితకు బీ-ఫారం ఇవ్వడంతో పాయం దేవికి టీడీపీ బీ-ఫారం రాలేదని, దీంతో పాయం దేవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని వివరించారు. కూటమి తరపున టీడీపీ, జనసేన గుర్తులు ఎవరికీ రాకపోవడంతో టీడీపీ కార్యకర్త అయిన పాయం దేవికి తాము అండగా ఉండి ప్రచారం చేశామని, అదే తప్పైతే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఈ ఎన్నికల్లో ఎవరికీ గుర్తులు రాని పరిస్థితిలో పాయం దేవిని జడ్పీటీసీగా గెలిపించి తమ సత్తా చూపిస్తామని మీడియా సమావేశంలో స్పష్టం చేస్తూ శ్రీనివాసరావు కన్నీటి పర్యంతమయ్యారు.




