Rampachodavaram: ఈ అడవి మాది.. ఈ భూమి మాది కదంతొక్కిన గిరిజన లోకం!

Rampachodavaram: పోలవరం జిల్లా రంపచోడవరంలో జీఓ నెం.3 పునరుద్ధరణ, 1/70 చట్టం అమలు కోసం వేలాది మందితో ఆదివాసీ మహా గర్జన సభ, భారీ ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు.

Prasanna, Rampachodavaram
Published on: 20 July 2026 6:03 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: ఈ అడవి మాది.. ఈ భూమి మాది కదంతొక్కిన గిరిజన లోకం!

రంపచోడవరం: పోలవరం జిల్లా, రంపచోడవరం కేంద్రంలో నిర్వహించిన ఆదివాసీ మహాగర్జన సభకు వేలాదిగా ఆదివాసీలు, గిరిజన సంఘాల నాయకులు, మహిళలు, యువత, వివిధ గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. సంప్రదాయ డప్పుల వాయిద్యాలు, గిరిజన నృత్యాలు, నినాదాల మధ్య పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి సభలో పాల్గొన్నారు.

"ఈ భూమి మాదే... నీరు మాదే... అడవిపై హక్కులు మావే", "జీఓ నెం.3ను వెంటనే పునరుద్ధరించాలి", "1/70 చట్టాన్ని పరిరక్షించాలి", "ఆదివాసీ హక్కులను కాపాడాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీల విద్య, ఉద్యోగాలు, భూములు, అడవి హక్కులు, స్వయం ప్రతిపత్తిని పరిరక్షించడంలో జీఓ నెం.3, 1/70 చట్టం అత్యంత కీలకమని, వాటిని బలహీనపరిస్తే ఆదివాసీల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నెల 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంపచోడవరం పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన దృష్టికి ఆదివాసీల సమస్యలను తీసుకెళ్లి, జీఓ నెం.3ను పునరుద్ధరించడం, 1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయడం, ఆదివాసీల రాజ్యాంగబద్ధ హక్కులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఆదివాసీ మహాగర్జన సభను నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకొని ఆదివాసీల హక్కులను చట్టబద్ధంగా పరిరక్షించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆదివాసీల భూములు, అడవులు, సహజ వనరులను కాపాడటం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని, గిరిజనుల ఆత్మగౌరవం, హక్కులు, భవిష్యత్తు కోసం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మహాగర్జన సభలో వివిధ ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, మహిళలు, యువజన సంఘాలు, పెద్ద సంఖ్యలో గిరిజన ప్రజలు పాల్గొని ఐక్యతను చాటారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story