Razole: రాజోలులో ఘనంగా వంగవీటి రంగా 79వ జయంతి వేడుకలు!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రధాన కూడలిలో వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
Razole: రాజోలులో ఘనంగా వంగవీటి రంగా 79వ జయంతి వేడుకలు!
రాజోలు: డాక్టర్.బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు ప్రధాన కూడలిలో వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సమాజంలోని బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగ అని కొనియాడారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి, మానవ సంబంధాలు, పేదల ఆత్మగౌరవం ఎంత ముఖ్యమో తన జీవితంతో నిరూపించారని పేర్కొన్నారు. 1988లో ఆయన అకాల మరణం తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన హత్య అత్యంత దారుణమైన ఘటనగా నిలిచిందని అన్నారు.
జయంతి వేడుకల్లో భాగంగా ఆంద్ర, తెలంగాణ - రంగా రాధా మిత్ర మండలి సేవా ట్రస్ట్ రాజోలు మండల అధ్యక్షుడు వలవల గోవింద్,ఆకుల మోహన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో అవసరమైన వారికి సకాలంలో రక్తం అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ రక్తదాన శిబిరానికి పెద్ద సంఖ్యలో యువత హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేసి వంగవీటి మోహనరంగకు ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సూరిశెట్టి శ్రీనివాస్,కోళ్ల బాబి,ఉలిశెట్టి అన్నపూర్ణ,నామన షణ్ముఖ, భారం రాజా,కాట్న పల్లపు రాజు తదితరులు పాల్గొన్నారు.




