Razole: రాజోలులో ఉరి తాళ్లతో వీఆర్ఏల నిరసన 15వ రోజుకు చేరిన ఉద్యమం!

Razole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం 15వ రోజుకు చేరింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉరి తాళ్లతో నిరసన తెలిపారు.

PRABHU, RAZOLE
Published on: 1 Oct 2026 10:07 AM IST
Razole
X

Razole: రాజోలులో ఉరి తాళ్లతో వీఆర్ఏల నిరసన 15వ రోజుకు చేరిన ఉద్యమం!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వీఆర్ఏల సంఘం పిలుపు మేరకు వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 15వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీఆర్ఏలు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

నిరసనలో భాగంగా వీఆర్ఏలు మెడలకు ఉరి తాళ్లు వేసుకుని తమ సమస్యల తీవ్రతను తెలియజేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ వృద్ధ వీఆర్ఏ తీవ్ర ఆవేదనకు గురై సొమ్మసిల్లి పడిపోవడంతో అక్కడున్న సహచరులు వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రూ.10,500 స్వల్ప వేతనంతో కుటుంబాలను పోషించుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారిందని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ సేవల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి. అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి. నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలి. తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని వీఆర్ఏలు విజ్ఞప్తి చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE