Korukonda: భర్త చనిపోయాక పిల్లలతో సహా రోడ్డున పడేసిన ఆడపడుచులు!
Korukonda: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో అత్తింటి వేధింపులు తాళలేక ఓ వితంతు మహిళ తన ఇద్దరు చిన్నారులతో న్యాయం కోసం నిరాహార దీక్షకు సిద్ధమైంది.
Korukonda: భర్త చనిపోయాక పిల్లలతో సహా రోడ్డున పడేసిన ఆడపడుచులు!
కోరుకొండ: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఓ వితంతు మహిళ తనకు, తన ఇద్దరు చిన్నారులకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటి వేధింపుల కారణంగా తాము నిలువనీడ లేకుండా పోయామని ఆరోపిస్తూ, అవసరమైతే కుటుంబ సమేతంగా బిక్షాటన చేపట్టింది అనంతరం నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించింది బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మృతి చెందిన అనంతరం అత్తమామలు లేకపోవడంతో తన ఆడపడుచులు, వారి భర్తలు తనను అత్తింటి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. గతంలో తనపై భౌతిక దాడి చేసి గాయపరిచారని, దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని తెలిపింది.
తన తల్లిదండ్రులపై కూడా దాడి చేసి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారని, తన ఇద్దరు చిన్నపిల్లలకు రావాల్సిన చట్టబద్ధమైన హక్కులను కూడా అడ్డుకుంటున్నారని వాపోయింది. మానసికంగా వేధింపులకు గురిచేస్తూ ఒంటరిగా చేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. న్యాయం కోసం బిక్షాటన చేస్తున్నానని, అవసరమైతే నిరాహార దీక్ష చేపడతానని స్పష్టం చేసింది.
న్యాయం జరగకపోతే ఆత్మహత్యే మార్గమవుతుందేమోనన్న ఆందోళనను కూడా వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి అండగా పాస్టర్ మోజెస్ బాబు ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి మద్దతుగా కోరుకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాస్టర్ మోజెస్ బాబు మాట్లాడుతూ, భర్తను కోల్పోయిన ఈ మహిళకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పటికీ వారికి రావాల్సిన చట్టబద్ధమైన హక్కులను నిరాకరిస్తున్నారని ఆరోపించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే బాధిత కుటుంబానికి మద్దతుగా తాను కూడా నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.




