Kadiyam: ప్రపంచ శాంతికి, సంపూర్ణ ఆరోగ్యానికి దివ్యౌషధం యోగా: మంత్రి కందుల దుర్గేష్
Kadiyam: కడియం నర్సరీలో ఘనంగా 'యోగాంధ్ర' కార్యక్రమం. జూన్ 21న అమరావతిలో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహిస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్.
Kadiyam: ప్రపంచ శాంతికి, సంపూర్ణ ఆరోగ్యానికి దివ్యౌషధం యోగా: మంత్రి కందుల దుర్గేష్
Kandula Durgesh: కడియం జీఎన్‌ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలోని శివాంజనేయ నర్సరీ ప్రాంగణంలో గురువారం ఉదయం జిల్లా స్థాయి యోగా సాధన కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ , ఆయుష్, ఏపీ ఎం ఐ పి, హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యోగా అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ మానవాళి శాంతియుతంగా, ఆరోగ్యంగా జీవించేందుకు భారత్ అందించిన గొప్ప వరమని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, క్రమం తప్పకుండా సాధన చేస్తే అది ఒక ఇష్టమైన అలవాటుగా మారుతుందని పేర్కొన్నారు.
కడియం నర్సరీలోని పచ్చని ప్రకృతి అందాల మధ్య యోగాసనాలు వేయడం మరువలేని అనుభూతిని కలిగించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రాచీన భారతదేశం అందించిన యోగా, ఆయుర్వేదాలను ప్రజల నిత్యజీవితంలో భాగం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు.
వచ్చే జూన్ 21న అమరావతిలో ‘యోగాంధ్ర’ రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించ నున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా యోగా పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
గత ఏడాది విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని గుర్తుచేశారు. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాను అభ్యసించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
యోగాంధ్రతోనే మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం: జేసీ మేఘాస్వరూప్
జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్ మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా, ధ్యానం చేయడం ద్వారా మనస్సుకు ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యం చేకూరుతాయని అన్నారు. యోగా ఒక రోజు కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ దానిని తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు.
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం అనంతరం కూడా నిరంతరంగా యోగా సాధన కొనసాగించాలని సూచించారు. జూన్ 14 సరస్వతి ఘాట్ లో పర్యటక కాన్సెప్ట్ పై , ఆర్ట్స్ కళాశాల లో జూన్ 21 జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు.
మండల, జిల్లా స్థాయిల్లో శిక్షకులు నైపుణ్యంతో యోగా ఆసనాలను బోధిస్తున్నారని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక మంది యోగాంధ్రలో నమోదు చేసుకున్నారని, గ్రామ స్థాయిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యక్షంగా హాజరు కాలేని వారు యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా యోగా అభ్యసించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి, ఆర్డీవో ఆర్. శివరాముడు, ఏపీఎంఐపీ పీడీ ఏ. దుర్గేష్, టూరిజం ఆర్డీ ఎన్.వి.వి.ఎస్. మూర్తి, డీఎంహెచ్‌వో డా. ఎన్. వసుంధర, యోగాంధ్ర సమన్వయకర్త విజయకుమారి, హార్టికల్చర్ అధికారి ఎన్. మల్లిఖార్జునరావు, జిల్లా పర్యాటక అధికారి పి. వెంకటాచలం, యోగా గురువు కె.వి.ఎన్. శ్రీధర్ రెడ్డి, శిక్షకులు కార్తిక్ రెడ్డి, హేమ నిర్మల, మాజీ ఎంపీపీ మార్గాని సత్యనారాయణ, మాధవరాయుడుపాలెం సర్పంచ్ ఏ. చంటి, శివాంజనేయ నర్సరీ ప్రతినిధులు మల్లు పోలరాజు, గట్టి నర్సయ్య, బ్రహ్మకుమారి మౌనిక, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు.




