Gopalapuram: ఆగస్టు 5న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన

Gopalapuram: ఆగస్టు 5న తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. పొగాకు రైతులతో టొబాకో బోర్డు వద్ద ముఖాముఖి నిర్వహించనున్నట్లు తానేటి వనిత తెలిపారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Updated on: 30 July 2026 8:37 PM IST
Gopalapuram
X

Gopalapuram: ఆగస్టు 5న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన

గోపాలపురం: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ హోంమంత్రి తానేటి వనితతో పాటు పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఆగస్టు 5న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోపాలపురం నియోజకవర్గంలో చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు, రైతులు హాజరయ్యేలా ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టాలని నాయకులు పార్టీ శ్రేణులకు సూచించారు.

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ అందించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలను గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పొగాకు రైతులకు న్యాయమైన ధరలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. గతంలో రైతుల సమస్యలపై పలుమార్లు ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు.

మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు పొగాకు సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. నాణ్యమైన పొగాకు పండించినప్పటికీ రైతులకు సరైన ధరలు లభించడం లేదని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పర్యటన ప్రకటించిన తర్వాతే పొగాకు ధరల్లో పెరుగుదల రావడం గమనార్హమని ఆమె వ్యాఖ్యానించారు.

మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పంటలకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చిన కంపెనీలు చివరి దశలో కొనుగోలు చేయకుండా వెనక్కి తగ్గడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల సమస్యలపై పోరాడేది వైఎస్సార్‌సీపీయేనని, ఆగస్టు 5న జరిగే జగన్ పర్యటనకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

పార్టీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 5న ఉదయం 9 గంటలకు గోపాలపురంలోని శివ కళ్యాణ మండపం వద్ద నుంచి భారీ ర్యాలీ ప్రారంభమవుతుంది. అనంతరం టొబాకో బోర్డు ప్రాంగణంలో పొగాకు రైతులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని రైతుల సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై తన అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

Next Story