Vargal: నవోదయ ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం: వర్గల్ ప్రిన్సిపాల్ రాజేందర్!

Vargal: వర్గల్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం నవంబర్ 28న ఉమ్మడి మెదక్ జిల్లాలోని 25 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.

Osman Pathan, GAJEWL
Published on: 25 Nov 2026 9:37 PM IST
Vargal
X

Vargal: నవోదయ ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం: వర్గల్ ప్రిన్సిపాల్ రాజేందర్!

వర్గల్: పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం, వర్గల్‌లో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ప్రవేశ ఎంపిక పరీక్షకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 80 సీట్ల భర్తీకి ఈ నెల 28న నవోదయ ప్రవేశ ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ తెలిపారు.

ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 25 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇందులో సిద్దిపేట జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 6, సంగారెడ్డి జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మొత్తం 5,148 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్ష నిర్వహణలో భాగంగా ఈ నెల 26న మూడు జిల్లాల కేంద్రాల్లో సెంటర్ సూపరింటెండెంట్లు, సెంటర్ లెవల్ అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణలో పరీక్ష నిర్వహణ విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు.

ప్రవేశ పరీక్ష ప్రకటన వెలువడినప్పటి నుంచి వివిధ దశల్లో సహకారం అందిస్తూ, అవసరమైన సూచనలు చేస్తున్న మూడు జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బందికి నవోదయ విద్యాలయ సమితి తరఫున ప్రిన్సిపాల్ రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL