Siddipet: అలీబాబా 40 దొంగల మాదిరిగా రేవంత్ పాలన: వంటేరు ప్రతాప్‌రెడ్డి

Siddipet: వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శ: రేవంత్‌రెడ్డి పాలన అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు గచ్చిబౌలిలో 200 ఎకరాలు కేటాయించాలి.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 7 Oct 2026 8:06 PM IST
Siddipet
X

Siddipet: అలీబాబా 40 దొంగల మాదిరిగా రేవంత్ పాలన: వంటేరు ప్రతాప్‌రెడ్డి

Siddipet: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన ప్రజా సమస్యలను పరిష్కరించకుండా మాజీ సీఎం కేసీఆర్‌ చుట్టూ రాజకీయాలు చేయడానికే పరిమితమైందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. గజ్వేల్‌లోని బీఆర్‌ఎస్‌ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారుల కోసం హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 200 ఎకరాల భూమిని కేటాయించి, లేఅవుట్‌ చేసి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లతో మోడల్‌ కాలనీ నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎర్రవల్లి సర్వే నంబర్‌ 325లో తొమ్మిది రోజులపాటు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారని, అక్కడ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు సంబంధించి ఒక్క గజం భూమి కూడా లేదని తెలిపారు. 388 ఎకరాల్లో 244 మంది రైతులు సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఫామ్‌హౌస్‌ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హామీలు, ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్ల అమలులో విఫలమైందని ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరం, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ వంటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు.

రేవంత్‌రెడ్డి పాలన ‘అలీబాబా 40 దొంగల’ మాదిరిగా ఉందంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేసి రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజలు, రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL