Husnabad: బండి భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్ చేయరు? సీఎం రేవంత్‌ను నిలదీసిన వొడితల సతీష్ కుమార్
Husnabad: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆరోపించారు.
Husnabad: బండి భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్ చేయరు? సీఎం రేవంత్‌ను నిలదీసిన వొడితల సతీష్ కుమార్
హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆయన కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆరోపించారు. సోమవారం హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మైనర్ బాలికపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుతో భగీరథ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులు గడిచినా ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర హోం శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు అరెస్టులో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఫిర్యాదు చేసిన బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై ఒత్తిళ్లు, బెదిరింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పోక్సో కేసు నమోదు చేయకుండా సాధారణ కేసుగా మార్చి మొత్తం వ్యవహారాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. “మంత్రుల కొడుకులకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా..?” అని ప్రశ్నించిన సతీష్ కుమార్, భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని కోరారు. ఈ కేసులో ఇంకా జాప్యం కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా చట్టప్రకారం వ్యవహరించాలని ఆయన కోరారు.




