Gajwel: బోగస్ సర్టిఫికెట్లతో కొలువు.. ఈసీటీ లెక్చరర్ అషరఫ్ హుస్సేన్ తొలగింపు!

Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన ఈసీటీ లెక్చరర్ ఎండీ అషరఫ్ హుస్సేన్‌ను అధికారులు డిస్మిస్ చేశారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 6 Oct 2026 7:49 PM IST
Gajwel
X

Gajwel: బోగస్ సర్టిఫికెట్లతో కొలువు.. ఈసీటీ లెక్చరర్ అషరఫ్ హుస్సేన్ తొలగింపు!

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ కళాశాలలో ఈసీటీ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఎండీ అషరఫ్ హుస్సేన్ బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు విచారణలో తేలింది. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు సదరు లెక్చరర్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. డిస్మిస్ అయిన మాజీ లెక్చరర్‌ను ఇకపై కళాశాల ప్రాంగణంలోకి అనుమతించవద్దని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

గజ్వేల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురలో ఈసీటీ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఎండీ అషరఫ్ హుస్సేన్ విద్యార్హతలు, ధృవీకరణ పత్రాలపై అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై సదరు లెక్చరర్‌కు అధికారులు మొదటి నోటీసు జారీ చేశారు. అనంతరం మరో నోటీసు కూడా ఇచ్చారు. రెండు నోటీసులకు లెక్చరర్ తన సమాధానాలను అధికారులకు సమర్పించారు. అనంతతం అధికారులు చేపట్టిన విచారణలో ఆయన సమర్పించిన సర్టిఫికెట్లు బోగస్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తేదీన ఎండీ అషరఫ్ హుస్సేన్‌ను విధుల నుంచి డిస్మిస్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు.

మరోవైపు.. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో డిస్మిస్ అయిన మాజీ లెక్చరర్‌ను ఇకపై కళాశాల ప్రాంగణంలోకి అనుమతించవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి కళాశాల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు.

దీంతో విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు మాజీ లెక్చరర్‌ను కళాశాల ప్రాంగణంలోకి అనుమతించడం లేదని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. సుమారు మూడు సంవత్సరాల పాటు కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహించిన వ్యక్తి విద్యార్హత ధృవీకరణ పత్రాలు బోగస్‌గా తేలడంతో విచారణ అనంతరం ఉద్యోగం నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. నకిలీ ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL