Gajwel: మల్లన్నసాగర్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి

Gajwel: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పెండింగ్ పరిహారాలు, ప్యాకేజీలను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ విడుదల చేశారు.

Osman Pathan, GAJEWL
Published on: 15 Nov 2026 7:26 PM IST
Gajwel
X

Gajwel: మల్లన్నసాగర్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి

గజ్వేల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిర్వాసితుల పక్షాన నిలిచి పోరాటానికి మద్దతు తెలిపిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, అధికారంలో ఉన్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆదివారం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బండ్ల స్వామి ఆధ్వర్యంలో బాధితులు బహిరంగ లేఖను విడుదల చేశారు.

ఈ సందర్భంగా బండ్ల స్వామి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ సమయంలో మూడు పంటలు పండే సారవంతమైన భూములను కోల్పోవడానికి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారని, తమ హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారని గుర్తుచేశారు. అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వాసితులకు మద్దతుగా ఏటిగడ్డ కృష్ణాపురంలో రెండు రోజుల పాటు దీక్ష చేపట్టి అండగా నిలిచారని తెలిపారు. ఆనాడు ఇచ్చిన హామీ, భరోసా మేరకు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.

ముఖ్యంగా ముంపు గ్రామాల్లోని ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులను ప్రత్యేక కుటుంబాలుగా గుర్తించకపోవడంతో అనేకమంది అర్హులు పరిహారాలు, పునరావాస ప్యాకేజీలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై కొందరు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం ద్వారా ప్యాకేజీలు పొందగా, కోర్టులను ఆశ్రయించని అర్హులైన మరికొందరికి ఇప్పటికీ న్యాయం జరగలేదని పేర్కొన్నారు.

గతంలో నిర్వాసితుల పోరాటానికి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి బాధితుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎర్రవల్లిలో ఫామ్‌హౌస్ భూములకు సర్వే నిర్వహించిన తరహాలోనే మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోనూ సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.

అర్హులైన ప్రతి నిర్వాసితుడిని గుర్తించి, పెండింగ్‌లో ఉన్న పరిహారాలు, పునరావాస ప్యాకేజీలు, ఇతర సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విడుదల చేసిన బహిరంగ లేఖలో బండ్ల స్వామి కోరారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL