Gajwel: గజ్వేల్‌లో సైబర్ నేరాలపై అవగాహనకు భారీ ఫ్లాష్ వాక్, టార్చ్‌లైట్ ర్యాలీ

Gajwel: గజ్వేల్‌లో 1,500 మంది విద్యార్థులతో సైబర్ నేరాలపై భారీ ఫ్లాష్ వాక్ నిర్వహించారు. డిజిటల్ అరెస్ట్, ఓటీపీ మోసాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Updated on: 30 Oct 2026 11:26 PM IST
Gajwel
X

Gajwel: గజ్వేల్‌లో సైబర్ నేరాలపై అవగాహనకు భారీ ఫ్లాష్ వాక్, టార్చ్‌లైట్ ర్యాలీ

గజ్వేల్: సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, డిజిటల్ మోసాల నివారణపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ నాయకత్వంలో శుక్రవారం గజ్వేల్ పట్టణంలో భారీ ఫ్లాష్ వాక్ నిర్వహించారు.

గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి బసవేశ్వర విగ్రహం వరకు, అక్కడి నుంచి తిరిగి పోలీస్ స్టేషన్ వరకు సాగిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బందితో పాటు 1,500 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు చేతుల్లో టార్చ్‌లైట్లు పట్టుకుని పట్టణ ప్రధాన రహదారుల గుండా సాగుతూ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. “Pause, Stop, Verify”, “Cyber Helpline 1930”, “No Digital Arrest” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ సైబర్ భద్రతపై ప్రజలను అప్రమత్తం చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని సైబర్ నేరాల నివారణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. చట్టంలో ‘డిజిటల్ అరెస్ట్’ అనే ప్రక్రియే లేదని స్పష్టం చేశారు. కొందరు సైబర్ నేరగాళ్లు పోలీసులమని, ఇతర ప్రభుత్వ అధికారులమని ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అలాంటి కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు.

ప్రస్తుతం ఓటీపీ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు అధికారులమని చెప్పి ఫోన్ చేసినా, గుర్తుతెలియని వ్యక్తులు అడిగినా ఎవరితోనూ ఓటీపీని పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాల కారణంగా ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోయి తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించి ధృవీకరించుకోవాలని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సైబర్ క్రైమ్ డీఎస్పీ రాజు, గజ్వేల్ పట్టణ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, గజ్వేల్ గ్రామీణ సీఐ రవిరాజు, ఇన్‌స్పెక్టర్ లతీఫ్, గజ్వేల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ దత్తాత్రేయ, తొగుట సీఐ శ్రీను, సైబర్ క్రైమ్ బృందం, పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL