Gajwel: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
Gajwel: గజ్వేల్లో చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, కుట్టుమిషన్లను పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
Gajwel: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
గజ్వేల్: పేదల సంక్షేమం, మహిళా సాధికారత, విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉత్తర్వులు అందజేయడంతో పాటు మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ఏటా సుమారు రూ.80 వేల కోట్ల వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంట్రాక్టర్లకు రూ.46 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు సంబంధించి సుమారు రూ.16 వేల కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం వారసత్వంగా పొందిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు అందిస్తూ పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు నాలుగు లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలు సొంతింటి కల నెరవేరుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, గత ప్రభుత్వం వారి ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఇటీవల పటాన్చెరులో పర్యటించిన సమయంలో ఓ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్న మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన విషయం తెలిసి ఆమె ఆనందం వ్యక్తం చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మంత్రి పేర్కొన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఇప్పటివరకు సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గజ్వేల్ ప్రాంతంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించామని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అప్పులు తీసుకొచ్చి, వాటిపై వడ్డీల రూపంలో ప్రజాధనాన్ని చెల్లించాల్సిన పరిస్థితి కల్పించారని మంత్రి విమర్శించారు.
ఎల్నినో ప్రభావానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో కరోనా మహమ్మారిని బీఆర్ఎస్ ప్రభుత్వమే సృష్టించిందా? అని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు ఎవరి నియంత్రణలోనూ ఉండవని, ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.




