Gajwel: డంపింగ్ యార్డులా గజ్వేల్ మార్కెట్ పారిశుధ్య కార్మికుల జీతాలు చెల్లించాలి!
Gajwel: గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను వంటేరు ప్రతాప్‌రెడ్డి పరిశీలించారు. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు.
Gajwel: డంపింగ్ యార్డులా గజ్వేల్ మార్కెట్ పారిశుధ్య కార్మికుల జీతాలు చెల్లించాలి!
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మార్కెట్‌ను సందర్శించిన ఆయన అక్కడి అపరిశుభ్ర పరిస్థితులను పరిశీలించి, కార్మికులు, దుకాణదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గజ్వేల్ పట్టణంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఐఏఎస్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ మార్కెట్‌ను సందర్శించి, తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి మార్కెట్ల నిర్మాణానికి ఆసక్తి చూపేవారని పేర్కొన్నారు. అలాంటి మార్కెట్ నేడు నిర్వహణ లోపాలతో దుర్వాసన వెదజల్లుతూ డంపింగ్ యార్డును తలపించడం బాధాకరమన్నారు.
మార్కెట్ ఆవరణలో కుళ్లిన కూరగాయలు, పూలు, ప్లాస్టిక్, మాంసపు వ్యర్థాలు పేరుకుపోయాయని, కనీస పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో దోమలు పెరిగి, వ్యాధులు ప్రబలే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ నిర్వహణను పట్టించుకునే నాథుడే కరువయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్లలో పనిచేసే పారిశుధ్య కార్మికుల వేతనాలను పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ, కనీసం ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు.
మార్కెట్ సందర్శన సమయంలో కార్మికులు తమ సమస్యలను వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా వేతనాలు అందక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, బతుకమ్మ, దసరా పండుగలను కూడా సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. కార్మికుల ఇబ్బందులను తెలుసుకున్న ఆయన వారికి ఆర్థిక సహాయం అందించారు.
పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో పారిశుధ్య కార్మికులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడంతో పాటు రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ఈ మార్కెట్‌కు వచ్చి కూరగాయలు, పండ్లు, పూలు, నిత్యావసర సరుకులు, మాంసం కొనుగోలు చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు. అయితే మార్కెట్లో అపరిశుభ్రత, దుర్వాసన, దోమల బెడద కారణంగా వినియోగదారులు రావడం తగ్గిపోయిందని, తమ దుకాణాలు సరిగా నడవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ దుస్థితి వ్యాపారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
మరోవైపు, మార్కెట్ ఆవరణలో నిర్మిస్తున్న షట్టర్ల నాణ్యతపైనా ప్రతాప్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులపై క్వాలిటీ కంట్రోల్ విభాగానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతను నిర్ధారించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి మార్కెట్ నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల వేతనాలను చెల్లించాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్ అత్తిలి శ్రీనివాస్, లక్ష్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ స్వామి, నాయకులు అహ్మద్, హనుమంత్‌రెడ్డి, దుకాణదారులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




