Gajwel: కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర
Gajwel: గజ్వేల్ నియోజకవర్గం వెంకటాపూర్‌లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేస్తున్న నల్లగొండ బృందాన్ని బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సత్కరించారు.
Gajwel: కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర
గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి పాదయాత్ర చేపట్టిన 30 మంది బృందానికి మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందంలోని సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పాలనతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ పాలనను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
తెలంగాణలోని ఏ గ్రామానికి వెళ్లినా, ఏ వ్యక్తిని పలకరించినా కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ వంటి ప్రాజెక్టులతో సాగునీటి రంగానికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో రైతులు, పేదలు, మహిళలకు అండగా నిలిచారని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేశారని అన్నారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పునరుద్ధరించి, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ వంటి ప్రాజెక్టులను నీటితో నింపాలని డిమాండ్ చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని సూచించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా అధికార పార్టీ నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలు, భూకబ్జాల వ్యవహారాల్లో నిమగ్నమవుతున్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు.
నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ పాదయాత్రలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు, యువకులు, వ్యాపారులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారని, ఆయా సమస్యలు, ప్రజల అనుభవాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కనకయ్య, నాయకులు అహ్మద్, మహేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




