Husnabad: అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలి: బీఆర్ఎస్ నేత మల్లికార్జున రెడ్డి!

Husnabad: హుస్నాబాద్ పరిసరాల్లో అక్రమంగా గుట్టలు తవ్వి మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో ఆర్డీఓ కార్యాలయంలో బీఆర్ఎస్ వినతిపత్రం ఇచ్చింది.

CH SRINIVAS, HUSNABAD
Published on: 9 Nov 2026 8:30 PM IST
Husnabad
X

Husnabad: అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలి: బీఆర్ఎస్ నేత మల్లికార్జున రెడ్డి!

హుస్నాబాద్, నవంబర్ 9: హుస్నాబాద్ ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గుట్టలను తవ్వి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆర్డీఓ కార్యాలయంలో ఏడీఓ అరిఫాకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా గుట్టలను తవ్వి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఎకరాల కొద్దీ గుట్టలు తవ్వి మట్టిని తరలించినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

గుట్టలను తవ్వి మట్టి తరలించడం ద్వారా కొందరు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. గుట్టలు కనుమరుగవుతుండటంతో పర్యావరణానికి నష్టం వాటిల్లడంతో పాటు వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. గుట్టలపై ఉన్న చెట్లు, బండరాళ్లు తొలగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములతో పాటు పట్టా భూముల పరిధిలోని గుట్టలు సైతం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టాలని, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వినతి పత్రం సమర్పణలో బీఆర్ఎస్ నాయకులు అయిలేని గాల్ రెడ్డి, భూక్య రాజు నాయక్, మాటూరి రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD