Husnabad: గౌరవెల్లి ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వ విఫలం సతీష్ కుమార్

Husnabad: హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రెస్ మీట్. గౌరవెల్లి రిజర్వాయర్ ఎన్జీటీ కేసు తొలగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమని విమర్శ.

CH SRINIVAS, HUSNABAD
Published on: 15 Aug 2026 7:33 PM IST
Husnabad
X

Husnabad: గౌరవెల్లి ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వ విఫలం సతీష్ కుమార్

హుస్నాబాద్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి జీవనాధారమైన గౌరవెల్లి రిజర్వాయర్ పై ఉన్న ఎన్జీటీ కేసును తొలగించి ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. శనివారం హుస్నాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు గడిచినా స్థానికంగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కనీసం ఎన్జీటీ కేసును రద్దు చేయించలేకపోయాడని విమర్శించారు. ముంచుకొస్తున్న కరువు పరిస్థితుల దృష్ట్యా వెంటనే ఎన్జీటీ కేసును ఎత్తివేయించి ప్రాజెక్టులో నీళ్లు నింపినట్లైతే బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగి రైతులకు పంటలు పండుతాయి అన్నారు. ప్రాజెక్టులో నీళ్లు నింపే బాధ్యతను మంత్రి పొన్నం తీసుకోవాలని సూచించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును పూర్తిచేసి ట్రయల్ రన్ కూడా చేసి నీళ్లు నింపామని చెప్పారు.

ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రాజెక్టు పూర్తి కావడం తట్టుకోలేక కొందరిని ఉసిగొలిపి ఎన్జీటీలో కేసులు వేయించి ప్రాజెక్టును అడ్డుకున్నారని ఆరోపించారు. వాళ్లు వేయించిన కేసులు ఇప్పుడు వారి మెడకే చుట్టుకున్నాయని ఎద్దేవా చేశారు.

కేవలం పర్యావరణ అనుమతుల కేసులు కోర్టు కొట్టి వేయడంతోనే పటాకాలు కాల్చి సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాన అడ్డంకి అయిన ఎన్జీటీ కేసు అలాగే ఉందని ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు.

ఇకముందు పర్యావరణం, ఎన్జీటీ అనుమతులపై కోర్టుకు రావద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనేది గమనించాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం లోను, ప్రధాన సమస్యల పరిష్కారం లోను ఇక్కడి నాయకులు దృష్టి సారించడం లేదని అన్నారు.

రహదారుల్లో బొమ్మలు పెట్టి అక్కడక్కడ పార్కులు కట్టి కేవలం పై మెరుగులకు సంబంధించిన పనులు చేయడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.

ఇప్పటికైనా మేడ్ మానేరు తోటపల్లి ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు... దేవాదుల, కాకతీయ కాలువ ద్వారా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు నీళ్లు ఇవ్వడంతో పాటు త్వరలోనే గౌరవెల్లి రిజర్వాయర్ ను కూడా నింపి అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్ మండలాలకు సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రిని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో ఎదురయ్యే తాగునీటి సమస్యల పై ప్రజలు చేసే ఆందోళనలు, ఉద్యమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story