Husnabad: హుస్నాబాద్ రహదారి విస్తరణపై స్థానికుల ఆందోళన
Husnabad: హుస్నాబాద్‌లో 80 ఫీట్ల రహదారి విస్తరణకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ ఇవ్వడంతో స్థానికుల నిరసన. నివాసాలు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు.
Husnabad: హుస్నాబాద్ రహదారి విస్తరణపై స్థానికుల ఆందోళన
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మల్లే చెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు 80 ఫీట్ల రహదారి విస్తరణకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. 80 ఫీట్ల రహదారి విస్తరణతో గృహ సముదాయాలు కోల్పోతున్న స్థానికులు మున్సిపల్ అధికారులను అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు.
రోజు పదుల సంఖ్యలో కూడా వాహనాలు వెళ్లని రహదారిని సెంట్రల్ లైటింగ్ తో 80 ఫీట్లకు విస్తరణ చేయాల్సిన అవసరమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని, ఇండ్లు కట్టుకొని ఉంటున్నామని, ఇప్పుడు ఉన్నఫలంగా రహదారి విస్తరణ పేరుతో తమ ఇండ్లు, గుడిసెలు కూల్చివేస్తామంటే ఊరుకోమన్నారు.
80 ఫీట్లతో కాకుండా 40 ఫీట్లతో రహదారి విస్తరణ చేపడితే నష్టమేంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు విస్తరణలో తమ నివాస స్థలాలు కోల్పోవడానికి సిద్ధంగా లేమన్నారు. అనవసరమైన చోట 80 ఫీట్ల రహదారి విస్తరణ చేయడం దేనికని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయమై స్పందించి ఇండ్ల స్థలాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించిన తర్వాతే పనులు చేసుకోవాలన్నారు. లేకుంటే వారికి మద్దతుగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.




