Husnabad: డివైడర్లు లేకే వరుస రోడ్డు ప్రమాదాలు: బీఎస్పీ రవీందర్ గౌడ్!

Husnabad: హుస్నాబాద్‌లో జాతీయ రహదారిపై డివైడర్లు లేకపోవడంతోనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, బీమా లేని వాహనాలపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేత రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 9 Nov 2026 8:28 PM IST
Husnabad
X

Husnabad: డివైడర్లు లేకే వరుస రోడ్డు ప్రమాదాలు: బీఎస్పీ రవీందర్ గౌడ్!

హుస్నాబాద్, నవంబర్ 9: హుస్నాబాద్ పట్టణం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బీఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు.జాతీయ రహదారిపై డివైడర్లు, హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు లేకపోవడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

హుస్నాబాద్ మండలం పందిళ్ల బ్రిడ్జి వద్ద, సమీపంలో ఇటీవల కాలంలో సుమారు ఆరు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడగా, మరికొందరు వికలాంగులయ్యారని తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు భద్రతా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సమస్యపై స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇసుక ట్రాక్టర్ల అతివేగం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని పేర్కొన్నారు. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తండ్రి, కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాల వేగాన్ని నియంత్రించడంతోపాటు రహదారిపై స్పీడ్ లిమిట్ అమలు చేయాలని సూచించారు.

ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌కు బీమా లేదని సమాచారం ఉందని, గత నెలలో హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటనలోనూ సంబంధిత వాహనానికి బీమా లేదని తెలుస్తోందన్నారు. ఈ విషయాలపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. బీమా, సరైన అనుమతులు లేకుండా రహదారులపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్న వాహనాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ తరఫున డిమాండ్ చేశారు.

ఒకవైపు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ మరోవైపు రహదారులపై ప్రమాదాలు కొనసాగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రవీందర్ గౌడ్ పేర్కొన్నారు. రహదారి భద్రతా చర్యలు క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని తెలిపారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD