Gajwel: గజ్వేల్ 17వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం!

Gajwel: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 17వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని వైస్ చైర్‌పర్సన్ పద్మాబాయ్ బుధవారం ప్రారంభించారు.

Osman Pathan, GAJEWL
Published on: 25 Nov 2026 8:21 PM IST
Gajwel
X

Gajwel: గజ్వేల్ 17వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం!

గజ్వేల్: కుటుంబ పెద్ద అకాల మరణంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో నమోదు కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కళ్యాణ్‌కర్ పద్మాబాయ్ నర్సింగరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రైతుబీమా పథకం ద్వారా జీవిత బీమా కల్పించిందని గుర్తుచేశారు. అదే తరహాలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ పెద్దకు రూ.5 లక్షల వరకు బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన కుటుంబ పోషకులు ఈ పథకానికి అర్హులుగా ప్రతిపాదించబడ్డారని తెలిపారు.

ప్రజల సౌకర్యార్థం మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అర్హులైన కుటుంబాలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు నకళ్లతో సమీపంలోని వార్డు శిబిరాలకు వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL