Rayapole: కాలపరిమితి ముగిసిన కల్యాణలక్ష్మి చెక్కులు వెనక్కి
Rayapole: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల జాప్యం.
Rayapole: కాలపరిమితి ముగిసిన కల్యాణలక్ష్మి చెక్కులు వెనక్కి
సిద్దిపేట జిల్లా: రాయపోల్ మండ లంలోని వివిధ గ్రామాలకు చెందిన 119 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చెక్కులు మంజూరయ్యాయి. అయితే కారణాలు తెలియదు కానీ అవి కొంతకాలం రెవెన్యూ కార్యాలయంలోనే పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
ఇటీవల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంక టస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి చేతుల మీదుగా దుబ్బాకలో 76 చెక్కులను మాత్రమే పంపిణీ చేశారు. అయితే మిగిలిన 43 చెక్కులు కాలపరిమితి ముగి యడంతో లబ్దిదారులకు అందజేయకుండా రెన్యువల్ కోసం రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి పంపించారు.
తొలుత లబ్దిదారులందరికీ చెక్కులు తీసుకోవాల్సిందిగా రాయపోల్ రెవెన్యూ అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ, అనంతరం కొందరికి చెక్కులు తర్వాత వస్తాయని తెలియజేయడంతో వారు నిరాశకు గురయ్యారు.
చెక్కులు మంజూరై కార్యాలయానికి చేరిన వెంటనే లబ్దిదారులకు పంపిణీ చేస్తే ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.




