Siddipet: మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల ఎదురుచూపులు.. సీఎంకు బాధితుల లేఖ!

Siddipet: మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదరకు బాధితులు లేఖ రాశారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 6 Oct 2026 7:55 PM IST
Siddipet
X

Siddipet: మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల ఎదురుచూపులు.. సీఎంకు బాధితుల లేఖ!

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన భూయజమానులు తమకు రావాల్సిన పరిహారం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న భూ పరిహారం కేసులను త్వరగా పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు భూ బాధితులు లేఖలు రాశారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన భూయజమానులు ఇప్పటికీ పరిహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు సంబంధించిన పరిహారం కేసులు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, కేసుల స్థితిగతులు మరియు పరిష్కార మార్గాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.

గతంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ఏటిగడ్డ కిష్టాపూర్ నిర్వాసితుల సమస్యలపై రేవంత్ రెడ్డి మద్దతుగా నిలిచిన విషయాన్ని భూయజమానులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా తమ సమస్యకు న్యాయం చేస్తారని ఆశించామని చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 34 నెలలు గడిచినా తమకు ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదని వారు వాపోతున్నారు.

తమ హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తుండగా కొందరు రాజకీయ నాయకులు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. 2025 డిసెంబర్ 3న ముఖ్యమంత్రి కార్యాలయానికి తమ సమస్యలను వివరిస్తూ లేఖ రాశామని, అనంతరం సీఎం కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని భూయజమానులు తెలిపారు.

అలాగే, తమ న్యాయపోరాటానికి మద్దతు తెలిపిన మంత్రి దామోదర రాజనర్సింహకు కూడా పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ఇప్పటివరకు స్పందన రాలేదని పేర్కొన్నారు. తమకు భూమికి భూమి లేదా తగిన పరిహారం అందించాలని కోరగా, అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించలేదని భూయజమానులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని, న్యాయం జరిగే వరకు గాంధేయ మార్గంలో శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని మల్లన్నసాగర్ భూ బాధితులు స్పష్టం చేశారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL