Gajwel: ఆర్.వి.యం హాస్పిటల్లో అరుదైన సంక్లిష్ట శస్త్రచికిత్స సక్సెస్!
Gajwel: గజ్వేల్ నియోజకవర్గం లక్ష్మక్కపల్లి ఆర్.వి.యం హాస్పిటల్లో రూ.5 లక్షల విలువైన సంక్లిష్ట గ్యాస్ట్రో శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా విజయవంతం చేశారు.
Gajwel: ఆర్.వి.యం హాస్పిటల్లో అరుదైన సంక్లిష్ట శస్త్రచికిత్స సక్సెస్!
గజ్వేల్: ములుగు మండలం లక్ష్మక్క పల్లి పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్న 1,350 పడకల ఆర్.వి.యం ట్రస్ట్ హాస్పిటల్ మరో అరుదైన వైద్య విజయాన్ని నమోదు చేసింది. అత్యంత సంక్లిష్టమైన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ శస్త్రచికిత్సను సుమారు ఐదు గంటల పాటు శ్రమించి వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద రోగికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా అందించడం విశేషం.
క్లిష్టమైన వ్యాధిని గుర్తించిన వైద్యులు
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందిన వాతం దేవరాజ్ ముదిరాజ్ కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. తొలుత దుబ్బాకలోని ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించిన ఆయన, వారి సూచన మేరకు కరీంనగర్‌లోని పలు ఆసుపత్రుల్లోనూ చికిత్స కోసం ప్రయత్నించారు. అయితే వ్యాధి తీవ్రత, చికిత్సలోని సంక్లిష్టత, అధిక ఖర్చుతో పాటు ప్రాణాపాయం ఉండే అవకాశాన్ని అక్కడి వైద్యులు వివరించారు.
ఈ నేపథ్యంలో ఆర్.వి.యం హాస్పిటల్లో అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు దేవరాజ్‌ను అక్కడికి తీసుకువచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం రోగికి అవసరమైన వైద్య పరీక్షలు, భోజన వసతి తదితర సదుపాయాలను ఉచితంగా కల్పించింది. వైద్య పరీక్షల్లో చిన్నప్రేగులు, పెద్దప్రేగులు పలు చోట్ల ఒకదానికొకటి అతుక్కుపోవడంతో పాటు పొత్తికడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించారు.
అది క్షయవ్యాధి (టీబీ) లేదా క్యాన్సర్ కారణంగా ఏర్పడిందా అనే అనుమానంతో బయాప్సీ పరీక్షలు నిర్వహించగా, చిన్నప్రేగుకు క్షయవ్యాధి, పెద్దప్రేగుకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ముందుగా క్షయవ్యాధికి అవసరమైన చికిత్స అందించిన అనంతరం, రోగి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మల విసర్జన కోసం తాత్కాలికంగా ఇలియోస్టమీ ఏర్పాటు చేశారు.
ఐదు గంటల పాటు సాగిన సంక్లిష్ట శస్త్రచికిత్స
తదుపరి దశలో భాగంగా క్యాన్సర్ ప్రభావితమైన పెద్దప్రేగు కుడివైపు భాగాన్ని తొలగించి, పేగుల మధ్య సహజ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించే ‘రైట్ హెమీకోలెక్టమీ విత్ రీస్టోరేషన్ ఆఫ్ బవెల్ కంటిన్యూటీ’ శస్త్రచికిత్సను వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రక్రియలో క్యాన్సర్ సోకిన పెద్దప్రేగు భాగాన్ని తొలగించడంతో పాటు, గతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఇలియోస్టమీని కూడా తొలగించి పేగుల సహజ మార్గాన్ని పునరుద్ధరించారు.
సుమారు ఐదు గంటల పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో దేవరాజ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. చాలాకాలంగా వేధిస్తున్న కడుపునొప్పి నుంచి ఉపశమనం లభించడంతో ఆయనతో పాటు భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అరుదైన వైద్య విజయంపై చింతమడక గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఆసుపత్రి యాజమాన్యాన్ని, వైద్య బృందాన్ని అభినందించారు.
నిపుణులైన వైద్య బృందం సేవలు
ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ నవ కిషోర్ ఆధ్వర్యంలోని వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. శస్త్రచికిత్స సమయంలో కీలక సేవలందించిన అనస్థీషియా నిపుణులు డాక్టర్ వంశీని కూడా ప్రత్యేకంగా అభినందించారు. రోగికి అవసరమైన అనస్థీషియా సేవలతో పాటు నిరంతర పర్యవేక్షణ అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
పేదలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం
ఈ సందర్భంగా ఆర్.వి.యం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RVMIMS) చైర్మన్ డాక్టర్ యాకయ్య, ఆసుపత్రి డైరెక్టర్ గోపీ కృష్ణ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ తాళ్ల శ్రీనివాస్, సీఈఓ దేవరకొండ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన పేద రోగులకు లక్షల రూపాయల ఖర్చుతో కూడిన సంక్లిష్ట శస్త్రచికిత్సలను సైతం ఉచితంగా అందించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు.




