Gajwel: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఏఐటీయూసీ
Gajwel: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించి, 50 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని గజ్వేల్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Gajwel: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఏఐటీయూసీ
గజ్వేల్: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివలింగ కృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం గజ్వేల్ ఏఎల్ఓ కార్యాలయంలో, సిద్దిపేట ఏసీఎల్ అధికారికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో శివలింగ కృష్ణ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని కోరారు. 50 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి నెలకు రూ.5 వేల పింఛన్ మంజూరు చేయాలని, నిరుపేద కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
సంక్షేమ బోర్డును ప్రైవేటీకరించే ప్రయత్నాలను నిలిపివేయడంతో పాటు, బోర్డులో జమ అయిన కార్మికుల సంక్షేమ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని, ద్విచక్ర వాహనాల కొనుగోలుపై 100 శాతం రాయితీ కల్పించాలని కోరారు.
సాధారణ మరణం సంభవించినప్పుడు గతంలో అందించే రూ.లక్ష పరిహారాన్ని రూ.2 లక్షలకు, ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ఇచ్చే రూ.6 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచేలా ఎఐటీయూసీ కార్మిక సంఘం పోరాటం చేసిందని గుర్తుచేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు సీరుల కనకయ్య, నాయకులు కొండకింది పోచయ్య, జాలగామ నర్సింలు, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ అధ్యక్షుడు జంగిటి మల్లేశం, పేట బాబు, మొట్ట శీను, మల్లేశం, బిక్షపతి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.




