Siddipet: మా శివారు భూములు మాకే కావాలి: మంత్రి పొంగులేటికి రైతుల వినతి!

Siddipet: మా శివారు భూములు మాకే కావాలి హైదరాబాద్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసిన మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్ రైతులు విచారణ జరిపి న్యాయం చేస్తామని మంత్రి హామీ.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 29 Sept 2026 10:49 PM IST
Siddipet
X

Siddipet: మా శివారు భూములు మాకే కావాలి: మంత్రి పొంగులేటికి రైతుల వినతి!

Siddipet: "మా గ్రామానికి చెందిన శివారు భూములను తిరిగి మాకే కేటాయించి, గ్రామ రికార్డుల్లో నమోదు చేయాలి" అని గజ్వేల్ నియోజకవర్గం, మర్కూక్ మండలానికి చెందిన శివారు వెంకటాపూర్ రైతులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన కార్యాలయంలో రైతులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సర్వే నంబర్ 325కు సంబంధించిన భూముల్లో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమ గ్రామానికి చెందిన భూముల సర్వే నంబర్లను శివారు వెంకటాపూర్ రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి, ఎర్రవల్లి గ్రామ రికార్డుల్లోకి బదిలీ చేయడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ రికార్డుల్లో జరిగిన ఈ మార్పుల కారణంగా తమ భూములకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కాబట్టి తమ సర్వే నంబర్లను తిరిగి శివారు వెంకటాపూర్ గ్రామ రికార్డుల్లో, నక్షా పటంలో (Map) యథాతథంగా నమోదు చేయాలని, సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ సమస్యపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను సమగ్రంగా పరిశీలిస్తామని, సర్వే నంబర్లను తిరిగి శివారు వెంకటాపూర్ రికార్డుల్లోకి మళ్లించేలా, సరిహద్దులను స్పష్టంగా చూపేలా చర్యలు తీసుకుని బాధిత రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL