Siddipet: జక్కాపూర్‌లో పోలీస్ కమిషనర్ మెగా డ్రైవ్
Siddipet: సిద్దిపేట పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన పోలీస్ - మన ఊరు కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ జక్కాపూర్ గ్రామాన్ని సందర్శించారు.
Siddipet: జక్కాపూర్‌లో పోలీస్ కమిషనర్ మెగా డ్రైవ్
Siddipet: ప్రజలకు, పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించి, కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మన పోలీస్ - మన ఊరు" కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, IPS మంగళవారం చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కాపూర్ గ్రామాన్ని సందర్శించారు.
గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే సీపీ రష్మి పెరుమాళ్.. "సిద్దిపేట సురక్ష నేత్ర" కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. చిన్నకోడూరు పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల గోడలపై గీసిన ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన చిత్రాలను సీపీ పరిశీలించి, చిత్రాలు వేసిన పోలీసు కానిస్టేబుల్ పర్శరములును అభినందించారు.
అనంతరం, మహిళలకు నిర్వహించిన ట్రాఫిక్, డ్రగ్స్, సైబర్ క్రైమ్ అవగాహన థీమ్ రంగుల రంగోలి (ముగ్గుల) పోటీలను ఆమె ఆసక్తిగా తిలకించారు. గ్రామస్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సీపీ ప్రారంభించారు. ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వృద్ధులకు, అర్హులకు ఉచితంగా కళ్లద్దాలు, నడవడానికి వీలుగా ఉండే చేతి కర్రలు, మోకాళ్ల క్యాప్‌లను ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి, వారికి ఎగ్జామ్ ప్యాడ్లను అందజేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు
యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు గాను గ్రామ యువతకు, పోలీస్ టీమ్‌కు మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్‌కు సీపీ టాస్ వేసి ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై ప్రజలకు అవగాహన కల్పించేలా ట్రాఫిక్ నియమాలు, డ్రగ్స్ మహమ్మారిపై లఘు చిత్రాలు ప్రదర్శించారు. స్థానిక విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు,సామాజిక అవగాహన స్కిట్ మరియు గ్రామ యువత రూపొందించిన డ్రగ్స్ అవేర్‌నెస్ షార్ట్ ఫిలిం అందరినీ ఆలోచింపజేశాయి.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, IPS మాట్లాడుతూ:
'అరైవ్ అలైవ్' అని రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాము , రాంగ్ సైడ్‌లో వాహనాలు నడపడం వల్ల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా తమ గమ్యస్థానాలకు, వారి కుటుంబాల చెంతకు చేరుకోవచ్చు. ఇక్కడ మీరు నేర్చుకున్న ట్రాఫిక్ నియమాలను మీ బంధువులకు, స్నేహితులకు కూడా నేర్పించండి." "యువత డ్రగ్స్ మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిని మంచి మార్గంలో నడిపించాలి.
ఒకవేళ ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలై ఉంటే, ఆ సమాచారాన్ని పోలీసులకు అందించండి. మేము వారికి ఉచితంగా డి-అడిక్షన్ (వ్యసన విముక్తి) చేయించి, సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాం. "పూర్వకాలంలో గ్రామాల్లో అందరూ ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే నేరాలకు పాల్పడుతున్నారు. గ్రామ పెద్దలు తమ ఐక్యతను, సంస్కృతిని యువతకు నేర్పించి, పల్లెటూరి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలి. మిమ్మల్ని రక్షించడానికి పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదనీ సిపి కోరారు.
సభ అనంతరం సీపీ రష్మి పెరుమాళ్ నేరుగా గ్రామ ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు, తోటి పోలీస్ అధికారులతో కలిసి ఆమె సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎఆర్ సుభాష్ చంద్రబోస్ గారు, ఏసిపి రవీందర్, సిఐ విద్యాసాగర్, చిన్నకోడూరు ఎస్ ఐ చంద్రమోహన్, సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు పాఠశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




