Siddipet: సిద్ధిపేటలో ఆర్థిక అక్షరాస్యత – సమ్మిళిత అవగాహన శిబిరం
Siddipet: సిద్ధిపేట విపంచి నిలయంలో ఆర్థిక సమ్మిళిత అవగాహన శిబిరం; సామాజిక భద్రతా, బీమా, పెన్షన్ పథకాలు వినియోగించుకోవాలని అధికారుల పిలుపు.
Siddipet: సిద్ధిపేటలో ఆర్థిక అక్షరాస్యత – సమ్మిళిత అవగాహన శిబిరం
సిద్ధిపేట: ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సేవలు చేరువ చేయడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు అందించడం లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్థిక సమ్మిళిత పథకాల సంతృప్త స్థాయి అమలు ప్రచార కార్యక్రమం (Financial Inclusion Saturation Campaign) లో భాగంగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – సిద్ధిపేట లీడ్ బ్యాంక్ Local Branch Managers ఆధ్వర్యంలో మంగళవారం సిద్ధిపేటలోని విపంచి నిలయంలో ప్రత్యేక ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక సమ్మిళిత అవగాహన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ మల్లికార్జున్, జిల్లా ఆడిట్ అధికారి శ్రీమతి జయశ్రీ, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ శ్రీ జి. నిఖిల్ రెడ్డి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ కె. హనుమంత రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ అధిపతి శ్రీ బి. శ్రీనివాస్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ బి. హరిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమం కేవలం బ్యాంకు ఖాతాలు ప్రారంభించడానికే పరిమితం కాకుండా, ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలు, బీమా రక్షణ, పెన్షన్ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పట్టణ పేదలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సేవలు – ప్రతి అర్హుడికి బీమా భద్రత – ప్రతి వృద్ధుడికి పెన్షన్ భరోసా అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, అర్హత కలిగిన సామాజిక భద్రతా పథకాలలో నమోదు చేసుకోవాలని లీడ్ బ్యాంక్ అధికారులు పిలుపునిచ్చారు.




