Gajwel: వర్గల్ బీసీ హాస్టల్‌లో టెన్త్ విద్యార్థి అనుమానాస్పద మృతి!

Gajwel: సిద్దిపేట జిల్లా వర్గల్ బీసీ బాలుర హాస్టల్‌లో టెన్త్ విద్యార్థి రామ్‌చరణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉపాధ్యాయుడు కొట్టడం వల్లేనని తండ్రి ఆరోపించారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 4 Nov 2026 11:17 PM IST
Gajwel
X

Gajwel: వర్గల్ బీసీ హాస్టల్‌లో టెన్త్ విద్యార్థి అనుమానాస్పద మృతి!

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వర్గల్ బీసీ బాలుర వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మర్కూక్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన ఆరే రామ్‌చరణ్ వర్గల్‌లోని బీసీ బాలుర వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. కాగా, పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు తనను కొట్టాడని, హాస్టల్‌లో ఉండలేకపోతున్నానని, వెంటనే ఇంటికి తీసుకెళ్లాలని తండ్రికి ఫోన్‌ చేసి చెప్పినట్లు సమాచారం.

దీంతో తండ్రి తాను వచ్చి ఇంటికి తీసుకెళ్తానని కుమారుడికి చెప్పినట్లు వెల్లడించారు. అయితే, తాను హాస్టల్‌కు చేరుకునేలోపే కుమారుడు ఉరివేసుకుని మృతిచెందినట్లు తెలిసిందని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. తనకు సమాచారం ఇవ్వకుండానే కుమారుడిని గజ్వేల్ ఆసుపత్రికి ఎలా తరలించారని ప్రశ్నించారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని, హాస్టల్‌, పాఠశాల సిబ్బంది వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి ఘటనకు ముందు అసలేం జరిగింది అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL