Siddipet: సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం

Siddipet: ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

RAJU, SIDDIPET
Updated on: 17 Nov 2026 11:21 PM IST
Siddipet
X

Siddipet: సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం

సిద్దిపేట: ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొననున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో సభ ప్రాంగణాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సిద్దిపేట బైపాస్ రోడ్డులోని నాగదేవత ఆలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని సందర్శించి, ఏర్పాట్ల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సభకు భారీ సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.సభకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్, బారికేడింగ్, లైటింగ్, భద్రతా ఏర్పాట్లు, జన సమీకరణ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సభా వేదిక నిర్మాణంతో పాటు ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ నెల 19న సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోనే తొలిసారిగా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు.ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు, భవిష్యత్తులో ప్రజల కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సభా వేదిక నుంచి ప్రసంగించనున్నారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు సిద్దిపేటతో పాటు గజ్వేల్, దుబ్బాక, జనగామ, హుస్నాబాద్, మానకొండూర్, సిరిసిల్ల, వేములవాడ, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు.సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి.

నిర్మాణాత్మకమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న ఈ బహిరంగ సభను ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షులు ఆంక్ష రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు, పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET