Siddipet: ‘అమరవీరుల త్యాగాలు’ నాటకానికి ఫిదా అయిన ప్రేక్షకులు!
Siddipet: ద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రదర్శించిన “తెలంగాణ నినాదం – అమరవీరుల త్యాగాలు” నాటకానికి విశేష ఆదరణ లభించింది.
Siddipet: ‘అమరవీరుల త్యాగాలు’ నాటకానికి ఫిదా అయిన ప్రేక్షకులు!
Siddipet: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలంగాణ నినాదం – అమరవీరుల త్యాగాలు” నాటక ప్రదర్శనకు విశేష ఆదరణ లభించిందని అసోసియేషన్ అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన అసోసియేషన్ నాయకులతో కలిసి మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ చరిత్ర, అమరవీరుల త్యాగాలు, తెలంగాణ ఆత్మగౌరవ పోరాట గాథను ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ నాటకాన్ని ప్రదర్శించినట్లు తెలిపారు. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి, చాకలి ఐలమ్మ ధైర్యం, రైతాంగ పోరాటాలు, నీళ్లు–నిధులు–నియామకాల ఉద్యమాలు, తొలి దశ మరియు మలిదశ తెలంగాణ ఉద్యమాలు, విద్యార్థుల త్యాగాలను రంగస్థలంపై ఆవిష్కరించామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన యువ కళాకారులను ఎంపిక చేసి సుమారు 30 రోజుల పాటు నటన, కథా రూపకల్పన, రంగస్థల ప్రదర్శన తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించిన అనంతరం ప్రపంచ కళానిలయంలో నాటకాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. నాటకంలో పాల్గొన్న కళాకారులు, టెక్నీషియన్లు తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని కొనియాడారు.
నాటకానికి లభించిన ఆదరణతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు తమ క్యాంపు కార్యాలయానికి కళాకారులను ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలను ప్రజలకు చేరవేసే ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించాలని హరీష్‌రావు సూచించినట్లు చెప్పారు. అసోసియేషన్ కేవలం వినోద కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే అంశాలపై నాటకాలు,
షార్ట్ ఫిల్మ్స్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తోందన్నారు. యువత సమస్యలు, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం, మహిళా భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై భవిష్యత్తులో మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మనెమ్మ, భూమయ్య, రాకేష్, మోజేష్, ప్రభంజన్ ,స్వేచ్ఛ రెడ్డి, కనకలక్ష్మి, దీపిక, శ్రీకృతి తదితరులు పాల్గొన్నారు.




