Jagadevpur: సబ్‌స్టేషన్ వద్ద రైతుల ధర్నా - బీఆర్‌ఎస్ శ్రేణుల సంఘీభావం!

Jagadevpur: గజ్వేల్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సంఘీభావం: రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని జగదేవ్‌పూర్ సబ్‌స్టేషన్ వద్ద రైతుల ధర్నా.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Updated on: 7 Oct 2026 7:59 PM IST
Jagadevpur
X

Jagadevpur: సబ్‌స్టేషన్ వద్ద రైతుల ధర్నా - బీఆర్‌ఎస్ శ్రేణుల సంఘీభావం!

Jagadevpur: రైతులకు 7 గంటల విద్యుత్ సరిపోవడం లేదని, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు జగదేవ్‌పూర్ సబ్‌స్టేషన్‌ వద్ద చేపట్టిన ధర్నాకు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు వెంటనే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను, 13 డిక్లరేషన్లను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనలో రైతులకు 7 గంటల కరెంటు మాత్రమే అందుతుండటంతో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించారని ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే వంటిమామిడి నుంచి సిద్దిపేట వరకు రైతులతో కలిసి వంటావార్పు వంటి కార్యక్రమాలు చేపట్టి రాజీవ్‌ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

కేసీఆర్‌ పదేళ్ల పాలనలో విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు సుమారు రూ.91 వేల కోట్లు ఖర్చు చేసి విద్యుత్‌ మౌలిక వసతులను అభివృద్ధి చేశారని తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,450 మెగావాట్లకు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. కొత్తగూడెం, భద్రాద్రి, భూపాలపల్లి, యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు థర్మల్‌, సోలార్ విద్యుత్‌ సామర్థ్యాన్ని పెంచామని పేర్కొన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించిన ప్రతాప్‌రెడ్డి, రైతులకు 24 గంటల కరెంటు పునరుద్ధరించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL