Siddipet: రాయితీపై శనగ, నూనెగింజల విత్తనాలు.. డీఏవో వెల్లడి!

Siddipet: రాయితీపై శనగ, పొద్దుతిరుగుడు, వేరుశనగ విత్తనాల పంపిణీ సిద్దిపేట జిల్లాలో 71 రైతు వేదికల్లో రైతు నేస్తం గజ్వేల్‌‌లో డీఏవో స్వరూపరాణి పాల్గొని ప్రకటన.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 3 Oct 2026 9:18 PM IST
Siddipet
X

Siddipet: రాయితీపై శనగ, నూనెగింజల విత్తనాలు.. డీఏవో వెల్లడి!

సిద్దిపేట: రైతులను పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగు వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా రైతులకు రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లాలోని 71 రైతు వేదికల్లో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ రైతు వేదికలో ఆమె పాల్గొన్నారు.

ఎంఏఎన్ పి పథకం కింద శనగ విత్తనాలు

మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సెస్ (ఎంఏఎన్ పి) పథకం కింద రైతులకు శనగ విత్తనాలను రాయితీపై పంపిణీ చేశారు. ఇందులో 50 మినీ కిట్లను 100 శాతం రాయితీపై ఉచితంగా, 9.92 క్వింటాళ్ల శనగ విత్తనాలను 70 శాతం రాయితీపై రైతులకు అందించారు. గజ్వేల్, జగదేవ్‌పూర్, చేర్యాల మండలాలకు 50 మినీ కిట్లు, గజ్వేల్, జగదేవ్‌పూర్, బెజ్జంకి, చేర్యాల మండలాలకు 44.9 క్వింటాళ్ల శనగ విత్తనాలను 70 శాతం రాయితీపై పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

పొద్దుతిరుగుడు సాగుకు ప్రోత్సాహం

జాతీయ నూనెగింజల మిషన్ (యాసంగి) సీజన్‌-2026లో భాగంగా జిల్లాలో నూనెగింజల పంటల సాగును ప్రోత్సహించేందుకు 3,000 ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు కోసం 100 శాతం రాయితీపై ఉచిత విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నకోడూరు, బెజ్జంకి, అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్, దౌల్తాబాద్, గజ్వేల్, తొగుట, రాయపోల్, సిద్దిపేట రూరల్ మండలాలను ఇందుకు ఎంపిక చేశారు.

వేరుశనగ సాగుకు ప్రోత్సాహం

వేరుశనగ పంటను ప్రోత్సహించేందుకు జిల్లాకు 1,250 ఎకరాలకు సరిపడా విత్తనాలు కేటాయించగా, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి మండలాలకు 850 ఎకరాలకు సరిపడా 68 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు.

విత్తనాల పంపిణీ సమయంలో రైతుల వివరాలను కృషి మ్యాపర్ యాప్, టీ-సీడ్స్ యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులు సూచించారు. విత్తనాలు పొందే రైతులకు భూసార పరీక్షలు నిర్వహించడంతో పాటు పంట సాగు అనంతరం ప్రారంభ దశ, మధ్య దశ, కోతకు ముందు దశల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట వివరాలు, ఫొటోలను కృషి మ్యాపర్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.కార్యక్రమంలో ఏడీఏ బాబు నాయక్, ఏఓ నాగరాజు, సుకేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL