Wargal: వర్గల్ నవోదయ విద్యాలయంలో బాలికలకు ఉచిత సానిటరీ ప్యాడ్ల పంపిణీ!
Wargal: వర్గల్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 230 మంది బాలికలకు ఉచితంగా బయోడిగ్రేడబుల్ సానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు.
Wargal: వర్గల్ నవోదయ విద్యాలయంలో బాలికలకు ఉచిత సానిటరీ ప్యాడ్ల పంపిణీ!
వర్గల్: బాలికల ఆరోగ్యం, రుతుస్రావ పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు, వారికి అవసరమైన పరిశుభ్రత ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్గల్‌లోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఉచిత సానిటరీ ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
శుక్రవారం మధ్యాహ్నం విద్యాలయ ఎంపీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలలోని 230 మంది బాలికలకు జీవవిచ్ఛిన్నమయ్యే (బయోడిగ్రేడబుల్) సానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన వాల్మీకి ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ హరికిషన్, సంస్థ వాలంటీర్ మౌనిక ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు ప్యాడ్లను అందజేశారు. ఒక్కో ప్యాకెట్లో పది సానిటరీ ప్యాడ్లు ఉండగా, మొత్తం 230 ప్యాకెట్ల విలువ రూ.34,500గా నిర్వాహకులు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు సంస్థ లక్ష్యాలు, సేవా కార్యక్రమాల గురించి విద్యార్థినులకు వివరించారు. రుతుస్రావ సంబంధిత పేదరికాన్ని నిర్మూలించడం, బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
డాక్టర్ హరికిషన్ మాట్లాడుతూ ప్రత్యూష, రోటరీ క్లబ్ ఆఫ్ అభ్యుదయ (హైదరాబాద్) సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యాలయ ప్రధానాచార్యులు దాసి రాజేందర్, ఆఫీస్ సూపరింటెండెంట్ శరత్‌తో పాటు విద్యాలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వాలంటీర్ మౌనిక మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన బాలికలకు రుతుస్రావ పరిశుభ్రతపై సరైన అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు అడిగిన పలు సందేహాలకు ఆమె సవివరంగా సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రధానాచార్యులు దాసి రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని తమ విద్యాలయంలో నిర్వహించిన వాల్మీకి ఫౌండేషన్ ప్రతినిధులకు విద్యాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




