Husnabad: ధాన్యం కొనుగోళ్లలో జాప్యమెందుకు: బీఆర్ఎస్, బీఎస్పీ నిలదీత
Husnabad: హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై బీఆర్ఎస్, బీఎస్పీ నాయకులు రైతులతో కలిసి ఆందోళన వ్యక్తం చేసి, తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Husnabad: ధాన్యం కొనుగోళ్లలో జాప్యమెందుకు: బీఆర్ఎస్, బీఎస్పీ నిలదీత
హుస్నాబాద్: ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్, బీఎస్పీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు 15 నుంచి 20 రోజులుగా ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మిల్లుల అనుసంధానం పూర్తికాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని, రైతులు ప్రైవేటు మిల్లర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
అక్కడ తేమ, తరుగు పేరుతో కోతలు విధిస్తూ తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు అండగా ఉంటామని చెప్పే ప్రభుత్వం కొనుగోళ్లలో ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి 20 రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యంలో తేమ శాతం పరీక్షించే యంత్రాలు సైతం అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ఆందోళనకు దిగిన తర్వాతే యంత్రాలు అందించే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కొనుగోళ్ల జాప్యంతో విసిగిపోయిన రైతులు ప్రైవేటు మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యం విక్రయించుకోవాల్సి వస్తోందన్నారు.
వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధాన్యం తడిసిపోతుందనే భయం రైతులను వెంటాడుతోందని నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికే మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, మిల్లుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసి కొనుగోళ్లకు ఆటంకాలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్శనలో నాయకులు, రైతులున్నారు.




