Gajwel: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సర్పంచ్‌లు పనిచేయాలి: వంటేరు ప్రతాప్‌రెడ్డి

Gajwel: గజ్వెల్ మండల బీఆర్ఎస్ సర్పంచ్‌ల ఫోరమ్ ఎన్నికైంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 8 Oct 2026 9:01 PM IST
Gajwel
X

Gajwel: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సర్పంచ్‌లు పనిచేయాలి: వంటేరు ప్రతాప్‌రెడ్డి

సిద్దిపేట జిల్లా, గజ్వేల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సూచించారు.

గజ్వెల్ మండలం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడిగా రంగంపేట గ్రామానికి చెందిన నడిగోప్పుల నాగరాజు, ఉపాధ్యక్షుడిగా ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాసామొల్ల శ్రీనివాస్‌ను మండలంలోని బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వెల్ మండల అధ్యక్షుడు బెండే మధు నూతనంగా ఎన్నికైన ఫోరమ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్‌ల పాత్ర కీలకమన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు.

గత ప్రభుత్వ పథకాలను ప్రస్తావించిన నేతలు..

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, రైతులు, పేదలు, మహిళల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి–షాదీముబారక్, కేసీఆర్ కిట్, పల్లె ప్రగతి వంటి పథకాలను అమలు చేశామని వారు పేర్కొన్నారు.

గ్రామాల్లో వైకుంఠధామాలు, చెత్త సేకరణ, డంప్‌యార్డుల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో తెలంగాణ గ్రామీణాభివృద్ధి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ సమస్యల పరిష్కారం, రైతులకు నాణ్యమైన విద్యుత్, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో నిరాశ నెలకొందని వారు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గ్రామీణ ప్రజల గొంతుకగా ఫోరమ్..

బీఆర్ఎస్ సర్పంచ్‌ల ఫోరమ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గ్రామీణ ప్రజల గొంతుకగా ఫోరమ్ పనిచేయాలని, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అహ్మదీపూర్ సర్పంచ్ బ్యాగారి ప్రభాకర్, కోలుగూరు జ్యోతి స్వామి, గిరిపల్లి పిట్ల లావణ్య రమేష్, మక్త మాసాన్‌పల్లి ఫహీమ్, షేరిబల్లి మమత శ్రీనివాస్‌రెడ్డి, శ్రీగిరిపల్లి కల్పన బాలస్వామి, బూర్గుపల్లి చెలిమేటి వెంకటలక్ష్మి, బంగ్లా వెంకటాపూర్ నాగమణి నర్సింలు, నాయకులు రమేష్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL