17-Clue Sudoku Explained: 17 క్లూలతోనే సుడోకు.. సూపర్ కంప్యూటర్‌కే ఏడాది సమయం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఛాలెంజ్!
Discover why the 17-clue Sudoku is considered one of the toughest puzzles ever. 'సుడోకు' పజిల్స్ అంటే ఇష్టపడే వారు 17 క్లూలతో ఉండే సుడోకును పెను సవాలుగా భావిస్తారు.
17-Clue Sudoku Explained: 17 క్లూలతోనే సుడోకు.. సూపర్ కంప్యూటర్‌కే ఏడాది సమయం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఛాలెంజ్!
17-Clue Sudoku Explained: 'సుడోకు' పజిల్స్ అంటే ఇష్టపడే వారు 17 క్లూలతో ఉండే సుడోకును పెను సవాలుగా భావిస్తారు. సాధారణంగా పత్రికల్లో లేదా మొబైల్ యాప్‌లలో కనిపించే సుడోకు పజిల్స్‌లో 25 నుంచి 35 వరకు క్లూలు (ముందుగా ఇచ్చే సంఖ్యలు) ఉంటాయి. అలాంటి సుడోకు పజిల్స్‌ను చాలా త్వరగా పూర్తిచేసేయొచ్చు. అయితే కేవలం 17 క్లూలతో కూడా సరైన సుడోకు రూపొందించవచ్చని గణిత శాస్త్రవేత్తలు నిరూపించారు. 17 సంఖ్య సుడోకు పజిల్‌కు కనిష్ట క్లూల సంఖ్యగా గుర్తింపు పొందింది.
ఈ విషయాన్ని ఐర్లాండ్‌లోని యూనివర్శిటీ కాలేజ్ డబ్లిన్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ గ్యారీ మెక్‌గ్వైర్ తన బృందంతో కలిసి శాస్త్రీయంగా నిరూపించారు. ఈ పరిశోధన కోసం వారు సూపర్ కంప్యూటర్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. మొత్తం 70 లక్షల కోర్-సీపీయూ గంటల కంప్యూటింగ్ శక్తిని వినియోగించగా.. ఈ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. చివరికి 17 క్లూల కంటే తక్కువతో సుడోకు రూపొందించడం సాధ్యం కాదని నిర్ధారించారు.
ఈ పరిశోధనతో ప్రేరణ పొందిన ఓ సుడోకు అభిమాని ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాడు. తన స్నేహితుడు ఇచ్చిన 17 క్లూల సుడోకు పరిష్కరించలేకపోయిన అతడు.. సుడోకు వెనుక ఉన్న గణితాన్ని అధ్యయనం చేశాడు. ఆపై దాదాపు 50 వేల 17-క్లూ సుడోకు పజిల్స్‌ను ఒకేచోట అందుబాటులోకి తీసుకొచ్చాడు. వాటిని పరిష్కరించే సదుపాయాన్ని కూడా వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేశాడు. ఈ జాబితాలోని ప్రతి పజిల్ చెల్లుబాటు అయ్యే 17-క్లూ సుడోకే అని చెబుతున్నారు. రోజుకు ఒక సుడోకు మాత్రమే పరిష్కరిస్తే.. ఈ మొత్తం సేకరణను పూర్తి చేయడానికి 130 ఏళ్లకు పైగా సమయం పడుతుంది.
అయితే తక్కువ క్లూలు ఉన్నాయంటేనే అది అత్యంత కఠినమైన పజిల్ అని అర్థం కాదు. అయినప్పటికీ క్లూల సంఖ్య తక్కువగా ఉంటే సాధారణంగా పజిల్ క్లిష్టత పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి 17-క్లూ సుడోకులు ప్రపంచవ్యాప్తంగా పజిల్ ప్రేమికులకు ఇప్పటికీ పెద్ద సవాలుగానే ఉన్నాయి. గణితం, తార్కిక ఆలోచన, ఓర్పును పరీక్షించే ఈ పజిల్స్‌ను పరిష్కరించడం చాలామందికి ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. కొందరు నిమిషాల్లో పూర్తి చేస్తే.. మరికొందరికి గంటలు పట్టడం కూడా అసాధారణం కాదు. అలాంటి ఓ క్లిష్ట సుడోకే ఇది. మీరు ఓసారి ట్రై చేయండి.




