Pushkar Cattle Fair 2026: రెండడుగుల గేదె ధర అక్షరాలా రూ.కోటి? వైరల్ అవుతున్న పింకీ కథ!

Pushkar Cattle Fair 2026: రాజస్థాన్ పుష్కర్ పశువుల మేళా 2026లో కేవలం 2 అడుగుల ఎత్తు ఉన్న ‘పింకీ’ అనే చిన్న గేదె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థానేకు చెందిన సోహిల్ పెంచుతున్న ఈ గేదె ధరపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Arun Chilukuri
Published on: 25 Nov 2026 4:37 PM IST
Pushkar Cattle Fair 2026
X

Pushkar Cattle Fair 2026: రెండడుగుల గేదె ధర అక్షరాలా రూ.కోటి? వైరల్ అవుతున్న పింకీ కథ!

Pushkar Cattle Fair 2026: రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగిన పుష్కర్ పశువుల మేళా 2026 నవంబర్ 24తో ముగిసినప్పటికీ, ఆ మేళాలో కనిపించిన ఒక అరుదైన జంతువు గురించి సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగడం లేదు. సాధారణంగా పశువుల మేళాల్లో భారీకాయం ఉన్న పశువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. కానీ ఈసారి కేవలం 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న ‘పింకీ’ (Pinky) అనే చిన్న గేదె అందరి దృష్టిని ఆకర్షించి, మేళాకే హైలైట్‌గా నిలిచింది.

ప్రపంచంలోనే అత్యంత పొట్టి గేదెగా గుర్తింపు!

సాధారణ గేదెలతో పోలిస్తే పింకీ ఆకారం చాలా చిన్నదిగా ఉండటంతో దీనిని ప్రపంచంలోనే అత్యంత పొట్టి గేదెగా అభివర్ణిస్తున్నారు. మేళాకు వచ్చిన చిన్నారుల నుంచి స్వదేశీ, విదేశీ పర్యాటకుల వరకు అందరూ పింకీని ఆసక్తిగా తిలకించారు. దీనిని చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా, పింకీతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి సందర్శకులు పోటీ పడ్డారు.

యజమాని సోహిల్ చెప్పిన ఆసక్తికర విషయాలు:

పింకీ యజమాని సోహిల్ మహారాష్ట్రలోని థానేలో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. పింకీ పొట్టిగా ఉండటానికి కారణం ఏ ప్రత్యేక జాతో కాదని, సహజంగానే అలా పెరిగిందని ఆయన తెలిపారు. పింకీకి 5 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ సాధారణ గేదెల మాదిరిగా శారీరక ఎదుగుదల కనిపించలేదని సోహిల్ వివరించారు.

పింకీ తల్లి కూడా సుమారు 3 అడుగుల ఎత్తు ఉండేదని, రోజుకు 2 లీటర్ల పాలు ఇచ్చేదని చెప్పారు. అయితే పింకీ ఇంకా ఏ దూడకూ జన్మనివ్వలేదని పేర్కొన్నారు. తన వద్ద మరికొన్ని విభిన్నమైన జంతువులు ఉన్నాయని, వచ్చే ఏడాది మేళాకు వాటిని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

ధర రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు?.. వైరల్ కథనాలు

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు, పోస్టులలో పింకీ విలువ రూ.20 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే దీని ధరపై యజమాని సోహిల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏదేమైనా, తన విభిన్న రూపంతో పుష్కర్ మేళాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పింకీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ స్టార్‌గా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.